మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. క్రికెట్ ప్రపంచ కప్ 2019
Written By
Last Updated : శనివారం, 29 జూన్ 2019 (13:20 IST)

ఇంగ్లండ్ ఓడిపోవాలి.. భారత్ గెలవాలి : అల్లాను ప్రార్థిస్తున్న పాక్ క్రికెట్ ఫ్యాన్స్

ఇంగ్లండ్ వేదికగా ఐసీసీ క్రికెట్ వరల్డ్ కప్ పోటీలు జరుగుతున్నాయి. మే 30వ తేదీన ప్రారంభమైన ఈ మ్యాచ్‌లు ఒక్క రోజు కూడా విరామం లేకుండా సాగుతున్నాయి. ప్రస్తుతం ఈ లీగ్ పోటీలు చివరి దశకు చేరుకున్నాయి. ప్రస్తుతానికి ఆస్ట్రేలియా, భారత్ జట్లు మాత్రమే సెమీస్ రేసుకు చేరుకున్నాయి. 
 
ఈ నేపథ్యంలో ఇంగ్లండ్ - భారత్ జట్ల మధ్య ఈనెల 30వ తేదీ ఆదివారం కీలక మ్యాచ్ జరుగనుంది. ఈ మ్యాచ్‌లో భారత్ గెలవాలని, ఇంగ్లండ్ జట్టు చిత్తుగా ఓడిపోవాలని పాకిస్థాన్ క్రికెట్ ఫ్యాన్స్ బలంగా కోరుకుంటున్నారు. ఇందుకోసం తమ ఇష్టదైవమైన అల్లాను ప్రార్థిస్తున్నారు. 
 
ఇదే విషయంపై ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ నాసిర్ హుస్సేన్ తన ట్విట్టర్ ఖాతాలో ఓ ప్రశ్న సంధించాడు. "ఆదివారం జరిగే మ్యాచ్‌లో మీరు ఏ జట్టు గెలవాలని కోరుకుంటున్నారు" అన్నది ఆయన ప్రశ్న. దీనికి పాక్ క్రికెట్ ఫ్యాన్స్ భారీ సంఖ్యలో స్పందించారు. 
 
'అనేక ఫ్యాన్స్ ముమ్మాటికీ భారతే గెలవాలని, ఇంగ్లండ్ ఓడిపోవాలని' చెప్పారు. మరికొందరు 'జై హిందుస్థాన్' అంటే.. ఇంకొందరు వందేమాతరం అన్నారు. మరొకరు స్పందిస్తూ, 'మేం పొరుగువారిని చాలా ప్రేమిస్తాం. మేం ఖచ్చితంగా భారత్‌కే మద్దతిస్తాం' అంటూ స్పందించారు. 
 
అలాగే, ఇంకొకరు మాట్లాడుతూ 'ఇంగ్లండ్‌కు వ్యతిరేకంగా భారత్ పాక్‌లు ఒక్కటవుతాయి' అంటూ ఓ నెటిజన్ ఆన్సర్ ఇచ్చాడు. 'నేను పాకిస్థానీని. కానీ, నేను ఇండియా జట్టుకు మద్దతిస్తా. ఎందుకంటే ఎవరెన్ని చేసినా పాకిస్థాన్ జట్టు గెలవదని నాకు తెలుసు. భారత్ జట్టు మాకంటే చాలా ముందుంది' అంటూ ఆన్సర్ ఇచ్చారు. ఇంకో అభిమాని.. 'విరాట్ 18' అని రాసివున్న జెర్సీ ధరించి బైకుపై వెళుతున్న ఓ వ్యక్తి ఫోటోను పోస్ట్ చేశారు.