మంగళవారం, 5 నవంబరు 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. క్రికెట్ ప్రపంచ కప్ 2019
Written By
Last Updated : శనివారం, 29 జూన్ 2019 (13:01 IST)

వరల్డ్ కప్ 2019 : పరువు నిలుపుకున్న సఫారీలు : లంక ఆశలు ఆవిరి

ఐసీసీ క్రికెట్ ప్రపంచ కప్ టోర్నీలో భాగంగా, శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో సఫారీలు పరువు దక్కించుకున్నారు. ఈ మ్యాచ్‌లో శ్రీలంకపై 9 వికెట్ల తేడాతో విజయభేరీ మోగించింది. అంటే ఈ టోర్నీలో సౌతాఫ్రికా మొత్తం 8 మ్యాచ్‌లు ఆడగా, ఐదు ఓటములు, రెండు విజయాలు సాధించింది. 
 
మరోవైపు, ఈ ఓటమితో శ్రీలంక జట్టు సెమీస్ రేస్ అవకాశాలను మరింత సంక్లిష్టం చేసుకుంది. గెలిచి తీరాల్సిన ఈ మ్యాచ్‌లో లంక బ్యాట్స్‌మెన్లు చేతులెత్తేయడంతో చిత్తుగా ఓడిపోయారు. చెస్టర్ లీ స్ట్రీట్‌లో జరిగిన మ్యాచ్‌లో సఫారీలు అన్ని రంగాల్లో రాణించారు. 
 
ఈ మ్యాచ్‌లో తొలుత టాస్ గెలిచిన శ్రీలంక జట్టు 49.3 ఓవర్లలో 203 పరుగులకు ఆలౌటైంది. ఫామ్‌లో ఉన్న బ్యాట్స్‌మన్, కెప్టెన్ కరుణరత్నే (0) రబాడ వేసిన మొదటి బాల్‌కే గోల్డెన్ డక్‌గా పెవిలియన్ చేరాడు. అయినా కుషాల్ పెరెరా, ఫెర్నాండో ధాటిగానే బ్యాటింగ్ చేశారు. వీలు చిక్కినప్పుడల్లా బౌండ్రీలు బాదుతూ స్కోరు బోర్డును పరుగులు పెట్టించారు. రెండో వికెట్‌కు 67 పరుగులు జోడించాక ఫెర్నాండో.. డుప్లెసిస్‌కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. ఇక అక్కడి నుంచి లంక ఇన్నింగ్స్ తడబడింది. మాథ్యూస్ 11, మెండిస్ 23, ధనంజయ డిసిల్వ 24, జీవన్ మెండీస్ 18, తిషార పెరెరా 21, ఉడాన 17 చొప్పున పరుగులు చేశారు. 
 
ఆ తర్వాత 204 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన సౌతాఫ్రికా ఆడుతూపాడుతూ లక్ష్యాన్ని ఛేదించింది. కెప్టెన్ డుప్లెసిస్, వెటరన్ ఓపెనర్ హషీమ్ ఆమ్లా అజేయంగా నిలిచి జట్టును 37.2 ఓవర్లలోనే విజయతీరాలకు చేర్చారు. డుప్లెసిస్ 96 పరుగులు చేయగా, ఆమ్లా 80 పరుగులు సాధించాడు. వీరిద్దరూ రెండో వికెట్ కు అజేయంగా 175 పరుగులు జోడించారు. ఆఖర్లో డుప్లెసిస్ ఓ బౌండరీతో మ్యాచ్‌ను ముగించాడు.
 
ఈ మ్యాచ్ ఓటమితో సెమీస్ ఆశలు సంక్లిష్టంగా మారాయి. ఎందుకంటే.. లంక జట్టు ఇప్పటివరకు 7 మ్యాచ్‌లు ఆడింది. వీటిలో రెండింటిలో విజయం సాధించి ఆరు పాయింట్ల ఏడో స్థానంలో ఉంది. ఇందులో వర్షం కారణంగా 2 మ్యాచ్‌లు తుడిచిపెట్టుకుపోవడంతో వచ్చినవి 2 పాయింట్లు ఉన్నాయి. మరో రెండు మ్యాచ్‌లు ఆడాల్సివుంది. ఈ రెండు మ్యాచ్‌లు నెగ్గిన 10 పాయింట్లే ఖాతాలో చేరుతాయి. దీంతో అధికారికంగా లంక రేసులో ఉన్నా.. నాకౌట్ చేరడం ఇక అసాధ్యమే.