మంగళవారం, 26 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. బిబిసి తెలుగు
Written By
Last Modified: శనివారం, 6 జులై 2019 (15:37 IST)

వరల్డ్ కప్ 2019: సెమీఫైనల్స్‌ ఆడే ముందు భారత్ ఏం చేయాలి?

భారత్ - శ్రీలంకల మధ్య చివరి లీగ్ మ్యాచ్ శనివారం జరగబోతోంది. ఇప్పటికే సెమీఫైనల్స్‌కు చేరుకున్న కోహ్లీ సేన ఈ మ్యాచ్‌లో గెలుపు, ఓటముల గురించి పెద్దగా కలవరపడాల్సిన పని లేదు. అయితే, హెడింగ్లీ క్రికెట్ గ్రౌండ్‌లో జరిగే ఈ మ్యాచ్‌లో అందరి దృష్టీ రవీంద్ర జడేజా, మయంక్ అగర్వాల్‌ల మీదే ఉంటుంది. ఎందుకంటే, ప్రపంచ కప్ పోటీలలో ఇంతవరకూ ఈ ఇద్దరు ఆటగాళ్ళకు ఆడే అవకాశం లభించలేదు.

 
రవీంద్ర జడేజా మొదటి నుంచీ భారత జట్టులో ఉన్నాడు. కానీ, మయంక్ అగర్వాల్‌కు మాత్రం గతవారమే పిలుపు వచ్చింది. కెప్టెన్ కోహ్లీ, కోచ్ రవిశాస్త్రిల ఆలోచనలన్నీ ఇప్పుడు సహజంగానే సెమీఫైనల్లో అనుసరించాల్సిన వ్యూహం మీదే కేంద్రీకృతమై ఉంటాయి. రవిశాస్త్రి మరీ తీవ్రంగా ఆలోచిస్తూ ఉంటారని కూడా భావించవచ్చు. ఎందుకంటే, 2019లో మాదిరిగానే 2015లో కూడా భారతజట్టు అద్భుత ప్రదర్శన కొనసాగిస్తూ సెమీస్‌కు చేరింది. కానీ, సెమీ ఫైనల్లో ఆతిథ్య జట్టు అయిన ఆస్ట్రేలియా చేతిలో ఓడిపోయింది.

 
ఒక కోచ్‌గా రవిశాస్త్రి ఆ మ్యాచ్‌ను డ్రెసింగ్ రూము నుంచి చాలా దగ్గరగా చూశాడు. ఆ పరిస్థితులు ఆయనను వెంటాడకమానవు. అందుకే, రవీంద్ర జడేజా, మయంక్ అగర్వాల్ ఇద్దరూ ఒక మ్యాచ్‌లో ప్రాక్టీస్ చేస్తే, ఆ తరువాత జరగాల్సిన కీలక మ్యాచ్‌లకు వారు అవసరమైతే అందుబాటులో ఉంటారు. వారితోపాటు, దినేశ్ కార్తిక్‌కు కూడా తన సత్తా చాటుకోవడానికి మరో అవకాశం లభించవచ్చు. నిజానికి, భారత జట్టులో అటు బ్యాటింగ్‌లోనూ, ఇటు బౌలింగ్‌లోనూ కొన్ని సమస్యలు ఉన్నాయి.

 
రోహిత్ శర్మపైనే భారం
అయితే, ఇప్పటివరకూ సాగిన వరల్డ్ కప్ ప్రయాణంలో రోహిత్ శర్మ అద్భుతమైన ఫామ్‌లో ఉండడం ఆనందం కలిగించే విషయం. గాయంతో శిఖర్ ధవన్ టోర్నమెంటు నుంచి నిష్క్రమించాల్సి రావడంతో రోహిత్ శర్మ మీద అదనపు బాధ్యత పడింది. రోహిత్ శర్మకు మరో ఓపెనర్ రాహుల్ నుంచి మద్దతు లభించిన ప్రతిసారీ అతడు భారీ స్కోరు చేశాడు. కెప్టెన్ విరాట్ కోహ్లీ కూడా ప్రతి మ్యాచులోనూ దాదాపు 50 పరుగులు చేస్తూనే ఉన్నాడు. తన అత్యుత్తమ ఫామ్‌కు కోహ్లీ దగ్గర్లోనే ఉన్నారు.
 
రిషభ్ పంత్‌కు కూడా జట్టులో స్థానం కల్పించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఓపెనర్‌గా వచ్చిన రాహుల్, శిఖర్ ధవన్ లాగా దూకుడుగా ఆడలేకపోయినప్పటికీ, కుదురుగా తన బాధ్యతను నిర్వర్తిస్తున్నాడు. ఇంగ్లండ్‌లో పుట్టి పెరిగిన భారత సంతతివారు కూడా ఆ జట్టుకు మద్దతు ఇవ్వట్లేదు. 
 
ఇంతవరకూ బాగానే ఉంది. కానీ, ఇక్కడే ధోనీ సంగతేమిటన్న ప్రశ్న ఉదయిస్తోంది. ఇప్పటికీ ప్రపంచంలోని అత్యుత్తమ బ్యాట్స్‌మెన్స్‌లో ఒకరుగా ధోనీకి గుర్తింపు ఉంది. ఈసారి ప్రపంచకప్ టోర్నమెంటులో ధోనీ కొన్ని సార్లు మంచ స్కోరే చేశారు. కానీ, అతడి ఆటతీరులో మునుపటి ధాటి కనిపించడం లేదు. 'ది ఫినిషర్'గా గుర్తింపు తెచ్చుకున్న ధోనీ ఈ టోర్నమెంటులో అలాంటి మెరుపులు కురిపించలేదు. అతడి అత్యంత ప్రఖ్యాత హెలికాప్టర్ షాట్ సంగతి పక్కన పెడితే, కనీసం సింగిల్స్ తీసుకోవడానికి కూడా ధోనీ ఇబ్బంది పడుతున్నట్లు కనిపించాడు. ఏదిఏమైనా, ధోనీ సహకారం ఇప్పటికీ జట్టుకు చాలా అవసరం. ప్రపంచ కప్ సెమీ ఫైనల్ వంటి కీలక మ్యాచుల్లో ఆయన అనుభవం జట్టుకు బలం చేకూర్చుతుంది.
 
మొత్తంగా చూస్తే, బ్యాటింగ్‌పరంగా ఎవరెవరి మీద నమ్మకం పెట్టుకోవచ్చు? హార్దిక్ పాండ్యా కొన్ని మ్యాచుల్లో బాగా ఆడాడు. కానీ, మరికొన్నింటిలో పూర్తిగా నిరాశపరిచాడు. కేదార్ జాదవ్, దినేశ్ కార్తిక్‌లకు చెప్పుకోదగిన అవకాశాలేమీ రాలేదు. వచ్చిన అవకాశాల్లోనూ వారు పెద్దగా రాణించింది లేదు.
 
జడేజా, మయంక్‌లకు చోటు దొరుకుతుందా...
ఈ విషయాలన్నీ పరిగణనలోకి తీసుకున్నప్పుడు, శ్రీలంకతో జరిగే మ్యాచ్‌లో రవీంద్ర జడేజా, మయంక్ అగర్వాల్‌లకు అవకాశం కల్పించడం సముచితంగా కనిపిస్తోంది. ఇక, బౌలింగ్ విషయానికి వస్తే, భారత ఫాస్ట్ బౌలర్లు ఈ వరల్డ్ కప్‌లో తమ సత్తా గొప్పగా చాటుకున్నారు. జస్‌ప్రీత్ బుమ్రా, మహమ్మద్ షమీలు స్వయంగా కొన్ని మ్యాచులు గెలిపించారు. భువనేశ్వర్ పునరగామనం కూడా భేషుగ్గా ఉందనే చెప్పాలి. ఇంగ్లండ్ వాతావరణం, అక్కడి పిచ్‌ల మీద బంతి గాలిలోకి లేస్తున్న విధానం చూసినట్లయితే, ఇకపై జరిగే మ్యాచుల్లో ఈ ముగ్గురి అవసరం ఉంటుందనిపిస్తోంది.

 
అయితే, భారత స్పిన్ బౌలింగ్ చూస్తుంటేనే కొంత నిరాశ కలుగుతోంది. ఒక్క చాహల్‌ను మినహాయస్తే వేరే స్పిన్నర్లెవరూ ఈ టోర్నమెంటులో పెద్దగా వికెట్లు తీసుకోలేకపోయారు. అయితే, శ్రీలంకతో జరిగే మ్యాచ్‌లో చాహల్‌కు విశ్రాంతినిచ్చి, కుల్‌దీప్ యాదవ్‌కు అవకాశం ఇవ్వడం బాగుంటుంది. భారత జట్టు సెమీ ఫైనల్స్‌లో ఇంగ్లండ్ లేదా న్యూజీలాండ్‌తో తలపడాల్సి రావచ్చు. ఈ రెండు జట్లూ చాలా బలంగా ఉన్నాయి. అందుకే, శనివారం నాటి మ్యాచుకు తుది జట్టును ఖరారు చేసే ముందు టీమిండియా ఈ అంశాలన్నీ దృష్టిలో పెట్టుకోవాల్సి ఉంటుంది.

 
శ్రీలంకకు చివరి నవ్వు దక్కుతుందా...
ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్‌లో అద్భుత ప్రదర్శన చూపించడం మినహా శ్రీలంక జట్టు ఈ టోర్నీలో పెద్దగా రాణించలేదు. పైగా, అది సెమీ ఫైనల్స్‌లో కూడా లేదు. ఆ జట్టు ప్రధాన కోచ్ చండికా హథురూసింఘ బీబీసీతో మాట్లాడుతూ, "ప్రపంచ కప్ పోటీలకు రావడానికి ముందు నుంచే మా జట్టులో స్థిరత్వం లోపించింది. ఏదేమైనప్పటికీ, కీలకమైన మ్యాచులు కొన్నింటినైనా గెలిచి వెనక్కి వెళ్ళడం బాగుంటుంది. ఈ టోర్నమంటులో చివరి మ్యాచును గెలవడానికి మేం పూర్తి స్థాయిలో ప్రయత్నిస్తాం" అని అన్నారు.

 
మరికొన్ని రోజుల్లో కొలంబో విమానం ఎక్కాల్సిన ఈ జట్టు తమ దేశ క్రికెట్ అభిమానుల కోసం ఏదో ఒక కానుక తీసుకువెళ్ళాలి కదా! వరస పరాజయాలతో విషాదంలో పడిన శ్రీలంక జట్టుకు భారత్‌ను ఓడించడం కన్నా ఉత్సాహం కలిగించే అంశం ఇప్పుడు మరొకటి ఉండదు.
ఇంగ్లండ్ నేల మీద ఈ రెండు జట్ల మధ్య ఇంతకు ముందు 2017లో చాంపియన్స్ ట్రోఫీ మ్యాచ్ జరిగింది. ఆ మ్యాచ్‌లో శ్రీలంక జట్టు... భారత్ నిర్దేశించిన 321 పరుగుల లక్ష్యాన్ని కేవలం మూడు వికెట్లు మాత్రమే కోల్పోయి ఛేదించింది.

 
కానీ, ఇప్పుడు ఆ జట్టుకు అన్ని దారులూ మూసుకుపోయాయి. దాని మనోబలం కూడా బాగా తగ్గినట్లు కనిపిస్తోంది. బహుశా, అందుకే శుక్రవారం నాడు ఆ జట్టులోని సగం ఆటగాళ్ళు కూడా నెట్ ప్రాక్టీస్‌కు రాలేదు. ఈ పరిస్థితుల్లో భారత జట్టు తన చివరి లీగ్ మ్యాచ్ విజయాన్ని ఎలాగైనా సొంతం చేసుకోవాలని ఆశిస్తోంది. అలాగే, దక్షిణాఫ్రికాతో జరిగే మ్యాచులో ఆస్ట్రేలియా ఓడిపోవాలని కూడా ఆశిస్తూ ఉండవచ్చు. అప్పుడు భారత జట్టు పాయింట్ల పట్టికలో నంబర్ వన్ స్థానంలో ఉంటుంది. నాలుగో స్థానంలో ఉండే జట్టుతో తలపడుతుంది.