సోమవారం, 2 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. బిబిసి తెలుగు
Written By బిబిసి
Last Modified: గురువారం, 3 డిశెంబరు 2020 (15:31 IST)

వైఎస్ జగన్: 'నా తండ్రి ప్రారంభించిన పోలవరాన్ని పూర్తి చేయడం కొడుకుగా నా బాధ్యత' - ప్రెస్‌ రివ్యూ

తండ్రి ప్రారంభించిన ప్రాజెక్టును పూర్తి చేయడం కొడుకుగా తన బాధ్యతని, అందువల్ల పోలవరాన్ని తానే పూర్తి చేస్తానని ఏపీ సీఎం జగన్‌మోహన్‌ రెడ్డి ఆంధ్రప్రదేశ్‌ శాసనసభలో ప్రకటించినట్లు సాక్షి పత్రిక వెల్లడించింది. 2022నాటికి ఖరీఫ్‌కు నీళ్లందిస్తామని బుధవారంనాడు శాసనసభలో పోలవరం ప్రాజెక్టు వ్యవహారంపై జరిగిన చర్చ సందర్భంగా సీఎం జగన్‌ స్పష్టం చేశారు. ప్రాజెక్టు నిర్మాణంలో చంద్రబాబు ప్రభుత్వ చేసిన పాపాలను కడిగేస్తున్నామని ఆయన అన్నారు.
 
పోలవరం ప్రాజెక్టును చంద్రబాబు ఏటీఎంలా మార్చుకున్నారని, ప్రధాని మోదీ కూడా ఇక్కడ జరిగిన అవినీతి గురించి ప్రస్తావించారని సీఎం జగన్‌ గుర్తు చేసినట్లు సాక్షి రాసింది. అయితే పోలవరం చర్చ సందర్భంగా ప్రభుత్వం చేస్తున్న ఆరోపణలపై ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ తీవ్ర అభ్యంతరం తెలిపింది. అవగాహన రాహిత్యంతో జగన్‌ రాష్ట్ర పాలనను ప్రమాదంలోకి నెడుతున్నారని ప్రతిపక్ష నేత నారా చంద్రబాబు నాయుడు విమర్శించినట్లు సాక్షి తెలిపింది. పోలవరంపై మాట్లాడే అవకాశం ఇవ్వనందుకు నిరసనగా టీడీపీ శాసనసభ్యులు సభ నుంచి వెళ్లిపోయినట్లు పేర్కొంది.