సోమవారం, 25 నవంబరు 2024
  1. ఇతరాలు
  2. మహిళ
  3. సౌందర్యం
Written By సిహెచ్
Last Modified: శుక్రవారం, 1 మార్చి 2019 (20:35 IST)

ఉసిరిపొడిలో చెంచా పెసరపిండి, చెంచా నిమ్మరసం కలిపి...

ఉసిరి అనగానే విటమిన్‌ సి నిండుగా అందించే పోషకంగా మనందరికీ తెలుసు. ఉసిరి ఆహారంగానే కాదు చర్మం, జుట్టు అందానికీ కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది. రోజంతా ఎండ, దుమ్ము ధూళి కారణంగా చర్మంపై నలుపుదనం పెరుగుతుంది. గరుకుగా తయారవుతుంది. అలాంటప్పుడు ఉసిరిని ఉపయోగించి కొన్ని రకాల చిట్కాలతో చర్మ సౌందర్యాన్ని కాపాడుకోవచ్చు. ఆ చిట్కాలేమిటో చూద్దాం.
 
1. ముఖంపై ముడతలతో చాలామంది తమ వయసుకంటే పెద్దవారిగా కనిపిస్తారు. ఇలాంటివాళ్లు టేబుల్‌ స్పూన్‌ ఉసిరి పొడిలో చెంచా పెరుగు, కోడిగుడ్డు తెల్లసొన కలిపి ఆ మిశ్రమంతో ముఖానికి ప్యాక్‌లా వేసుకోవాలి. కనీసం రెండు మూడురోజులకోసారి చేస్తుంటే ముఖంపై ముడతలు తగ్గిపోతాయి.
 
2. ఉసిరి రసం ముఖానికి రాసి పది నిమిషాలాగి గోరువెచ్చని నీళ్లతో శుభ్రంచేసుకోవాలి. మీది మరీ సున్నిత చర్మతత్వం అయితే కొంచెం తేనె కలిపి రాసుకున్నా సరిపోతుంది. ఉసిరిలోని యాంటీ ఆక్సిడెంట్లు చర్మ గ్రంథుల్ని శుభ్రపరుస్తాయి.
 
3. మొటిమల సమస్యతో బాధపడుతున్నవారు ఉసిరిపొడిలో చెంచా పెసరపిండి, చెంచా నిమ్మరసం, కాసిని పాలు కలిపి మెత్తని పేస్ట్‌లా చేయాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి ప్యాక్‌లా వేసుకుని పావుగంటాగి గోరువెచ్చని నీళ్లతో శుభ్రం చేసుకోవాలి. ఇలా రోజుకోసారి చేస్తుంటే మొటిమల సమస్య దూరమవుతుంది.
 
4. కాలుష్యం, కఠిన రసాయనాల వాడకం వల్ల జుట్టు కుదుళ్లు దెబ్బతింటాయి. ఉసిరిలో ఉండే విటమిన్‌ సి, యాంటీ ఆక్సిడెంట్లు కుదుళ్ల వృద్ధికి తోడ్పడతాయి.
 
5. మాడు పొడిబారడం, చుండ్రు సమస్యలు గనుక ఉన్నట్లయితే..... ఉసిరిపొడి మజ్జిగలో నానబెట్టి దానికి కోడి గుడ్డు తెల్లసొన, చెంచా బాదం నూనె జత చేసి ఆ మిశ్రమాన్ని తలకు పట్టించాలి. అరగంటాగి మృదువైన షాంపూతో తలస్నానం చేస్తే ఆ సమస్య తగ్గిపోతుంది.