భారీగా ముడి చమురు ధర తగ్గింది - పెట్రోల్ ధరలు తగ్గేనా?
అంతర్జాతీయ చమురు మార్కెట్లో ముడి చమురు ధరలు భారీగా తగ్గాయి. ఒక బ్యారెల్ క్రూడ్ అయిల్ ధర ప్రస్తుతం 66 డాలర్లుగా ఉంది. బ్రెంట్ క్రూడ్ ఆయిల్ బ్యారెల్‌పై 1.72 డాలర్లు తగ్గి 66.51 డాలర్లకు చేరుకుంది. మే 21 తర్వాత ఇది అతి తక్కువ.
యూఎస్ వెస్ట్ ఇంటర్మీడియట్ ధర 1.96 డాలర్లు తగ్గి 63.50 డాలర్లకు పడిపోయింది. అంతకుముందు ఇంట్రాడేలో 63.29 డాలర్లకు పడిపోయి తర్వాత పుంజుకున్నది. గత మే నెల నుంచి ముడి చమురు ధర తగ్గుముఖం పట్టడం ఇదే తొలిసారి.
ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుతున్నాయన్న ఆందోళన మధ్య అమెరికా డాలర్ బలోపేతమైంది. వ్యాక్సినేషన్ తక్కువగా ఉన్న ప్రాంతాల్లో డెల్టా వేరియంట్ కరోనా వైరస్ విస్తరిస్తున్నదని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరించింది. ఈ పరిణామాల నేపథ్యంలో ఆయిల్ ధరలు తగ్గాయి.
ఇదిలావుంటే, భారత్‌లో పెట్రోల్, డీజిల్ ధరలు మాత్రం మండిపోతున్నాయి. ఇప్పటికే దేశ వ్యాప్తంగా ఈ చమురు ధరలు సెంచరీ దాటిపోవడంతో వినియోగదారులు గగ్గోలు పెడుతున్నారు. అయినప్పటికీ కేంద్ర రాష్ట్రాలు మాత్రం ఏమాత్రం పట్టించుకోవడం లేదు. ఇపుడు అంతర్జాతీయంగా ధరలు తగ్గిన నేపథ్యంలో దేశంలో పెట్రోల్ ధరలను తగ్గిస్తారో లేదో వేచి చూడాల్సిందే.