సోమవారం, 25 నవంబరు 2024
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 7 జులై 2022 (09:36 IST)

వంట నూనెల ధరల తగ్గించాలని కేంద్రం ఆదేశం

Oils
వంట నూనెల ధరలను తగ్గించాలని కేంద్రం ఆదేశించింది. దిగుమతి చేసుకునే వంట నూనెల ధరలను వారం రోజుల్లో లీటరుకు రూ.10 చొప్పున తగ్గించాలని అన్ని వంట నూనెల కంపెనీలను ప్రభుత్వం ఆదేశించింది. 
 
అంతర్జాతీయంగా ధరలు తగ్గినందున, దేశీయంగా గరిష్ట చిల్లర ధర (ఎంఆర్‌పీ)ను తగ్గించాలని, దేశవ్యాప్తంగా ఒక బ్రాండ్‌ నూనెకు ఒకే ఎంఆర్‌పీని పాటించాల్సిందిగా సూచించింది. ప్రస్తుతం దేశ వంట నూనె అవసరాల్లో 60 శాతానికి పైగా దిగుమతులే తీరుస్తున్నాయి. 
 
గత కొన్ని నెలల్లో అంతర్జాతీయంగా ధరలు పెరగడంతో, దేశీయంగా కూడా వంటనూనెల ధరలు ప్రియమయ్యాయి. మళ్లీ అంతర్జాతీయంగా వంటనూనెల ధరల్లో దిద్దుబాటు రావడంతో, స్థానికంగా ధరలు తగ్గించమని ప్రభుత్వం ఆదేశించింది. 
 
గత నెలలో నూనె ధరను లీటర్‌కు రూ.10-15 వరకు కంపెనీలు తగ్గించాయి. ప్రస్తుత ధోరణులపై వంటనూనెల సంఘాలు, ప్రధాన తయారీ కంపెనీలతో సమావేశమైన ఆహార కార్యదర్శి సుధాన్షు పాండే, తగ్గిన ధరల ప్రయోజనాన్ని వినియోగదార్లకు బదలాయించాల్సిందిగా సూచించారు.