ఆదివారం, 1 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 3 జూన్ 2021 (13:31 IST)

పీఎన్‌బీ స్కామ్.. మెహుల్‌ చోక్సీ బెయిల్‌ పిటిషన్‌ తిరస్కరించిన కోర్టు

mehul choksi
పంజాబ్ నేషనల్ బ్యాంకు (పీఎన్‌బీ) కుంభకోణం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న మెహుల్ చోక్సీని డొమినికా నుంచి భారత్‌కు రప్పించేందుకు సీబీఐ, ఈడీ ప్రయత్నాలు చేస్తున్నాయి. ఈ ప్రయత్నాలకు అడ్డుకునేందకు అతని సోదరుడు చేతన్‌ చోక్సీ రంగంలోకి దిగి.. అక్కడి ప్రతిపక్ష నేతతో కుమ్మక్కైనట్టు ప్రచారం జరుగుతోంది. ఇందులో భాగంగా భారీగా ముడుపులు ముట్టజెప్పినట్టు వార్తలు వినవస్తున్నాయి.
 
మెహుల్ చోక్సీని భారత్‌కు పంపడానికి సంబంధించి కోర్టులో విచారణ జరగడానికి ముందే చేతన్ చోక్సీ హాంకాంగ్ నుంచి నేరుగా భారీ మొత్తంతో డొమినికాలో వాలిపోయాడని, ప్రతిపక్ష నేత లెనాక్స్ లింటన్‌కు 2 లక్షల డాలర్లు ముట్టజెప్పాడని అక్కడి స్థానిక మీడియాలో వార్తలు వచ్చాయి.
 
విచారణ సందర్భంగా.. చోక్సీ సోదరుడు చేతన్​ చోక్సీతో పాటు డొమినికా విపక్ష పార్టీకి చెందిన లెన్నాక్స్​ లింటన్​ కోర్టులో ఉన్నట్టు వార్తలు వచ్చాయి. మెహుల్​ చోక్సీని అపహరించారనే వాదనను పార్లమెంట్​లో బలంగా వినిపించాలని, తద్వారా రానున్న ఎన్నికల్లో భారీగా నిధులు సమకూరుస్తామని లింటన్​కు చేతన్​ ఆఫర్‌ ఇచ్చినట్లు వార్తలున్నాయి. ఈ నేపథ్యంలో కోర్టు గదిలో ఆయన కనిపించడం ప్రాధాన్యం సంతరించుకుంది.
 
తాజాగా ఈ పీఎన్‌బీ కుంభకోణం కేసులో డొమినికా పోలీసుల అదుపులో ఉన్న మెహుల్‌ చోక్సీకి మరో ఎదురుదెబ్బ తగిలింది. ఆయన దాఖలు చేసిన బెయిల్‌ పిటిషన్‌ను మెజిస్ట్రేట్‌ కోర్టు తిరస్కరించింది. పిటిషన్‌పై విచారణ సందర్భంగా మెజిస్ట్రేట్‌ కోర్టుకు చోక్సీ చక్రాల కుర్చీపై హాజరయ్యారు. అంతకు ముందు ఆంటిగ్వా నుంచి డొమినికాలో అక్రమంగా ఎందుకు ప్రవేశించారో చెప్పాలని కోర్టు ఆదేశించగా.. వ్యక్తిగతంగా కోర్టుకు చోక్సీ వచ్చారు. 
 
అయితే, చోక్సీని ఎవరో అపహరించి డొమినికాకు తీసుకొచ్చారని ఆయన తరఫు న్యాయవాది కోర్టుకు తెలుపగా.. అక్రమంగానే ప్రవేశించారని అక్కడి పోలీసులు వాదించారు. భారత్‌లో 11 నేరాలకు పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్నందున.. ఇంటర్‌పోల్‌ రెడ్‌ నోటీసు జారీ అయ్యిందని పోలీసులు తెలిపారు. ఈ మేరకు ఇరువర్గాల వాదనలు విన్న కోర్టు బెయిల్‌ను తిరస్కరించింది. ఈ తీర్పు వెలువడిన అనంతరం పై కోర్టులో పిటిషన్‌ దాఖలు చేయనున్నట్లు అతని తరఫు న్యాయవాది తెలిపారు.