శనివారం, 30 నవంబరు 2024
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 31 మే 2021 (13:46 IST)

దేశంలో భగ్గుమంటున్న పెట్రోల్ ధరలు... కేంద్రం తొండాట

దేశ వ్యాప్తంగా పెట్రోల్, డీజల్ ధరలు భగ్గుమంటున్నాయి. ఈ ధరల పెంపుపై కేంద్రం తొండాట ఆడుతోంది. ఎన్నికల సమయంలో ఈ ధరలను స్థిరంగా ఉంచేలా మౌఖిక ఆదేశాలు జారీచేస్తూ, ఎన్నికలు పూర్తయిన తర్వాత ధరల పెంపునకు పచ్చజెండా ఊపుతోంది. ఫలితంగా ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల తర్వాత పెట్రోల్ ధరల బాదుడు మళ్లీ ప్రారంభమైంది. 
 
ముఖ్యంగా, తెలంగాణలోని అనేక జిల్లాల్లో రేట్లు సెంచరీ మార్క్‌కు చేరువవుతున్నాయి. ఐదు జిల్లాల్లో లీటరు పెట్రోల్ ధర 99 రూపాయలు దాటిపోయింది. ఒక్క మేలోనే పెట్రోల్, డీజిల్ రేట్లు 15 సార్లు పెరిగాయంటే… ధరల భారం ఎలా ఉందో అర్థ చేసుకోవచ్చు. పెరుగుతున్న ధరలతో వాహనదారులు బెంబేలెత్తిపోతున్నారు. అటు పెట్రోల్, డీజిల్ ధరల పెరుగుదలతో నిత్యావసరాల రేట్లు కూడా చుక్కలనంటునతున్నాయి. 
 
తెలంగాణలోని అన్ని జిల్లాలతో పోలిస్తే ఆదిలాబాద్‌లో పెట్రోల్ ధర ఎక్కువగా ఉంది. లీటరు ధర 99 రూపాయల 65 పైసలు పలుకుతోంది. హైదరాబాద్‌లో లీటరు పెట్రోలు ధర 97 రూపాయల 62 పైసలుగా ఉంది. నిజామాబాద్‌, వనపర్తి, కామారెడ్డి, గద్వాల జిల్లాల్లో లీటరు పెట్రోల్ రేటు 99రూపాయలు దాటింది. డీజిల్ ధరలు కూడా ఇలాగే పెరుగుతున్నాయి. 
 
ఆదిలాబాద్‌లో లీటర్ డీజిల్ ధర 94 రూపాయల 40పైసలు ఉండగా, హైదరాబాద్‌లో 92 రూపాయల 52 పైసలుగా ఉంది. ప్రీమియం పెట్రోల్ రేటు వారం రోజుల క్రితమే వంద రూపాయలు దాటగా.. ఇప్పుడు సాధారణ పెట్రోల్‌ సెంచరీకి 35 పైసల దూరంలో ఉంది. పెరుగుతున్న పెట్రోల్, డీజిల్ ధరలు ప్రజల జీవితంపై పెనుభారం మోపుతున్నాయి. 
 
రవాణా వ్యయం పెరుగడంతో నిత్యావసరాల ధరలు కూడా పెరిగిపోతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో క్రూడాయిల్ ధరలు పెరిగాయని, అందుకే చమురు రేట్లు పెంచుతున్నామని పెట్రో సంస్థలు అంటున్నాయి. దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాలు లాక్‌డౌన్ అమలు చేస్తున్నాయి. దీంతో పెట్రో ఉత్పత్తుల వినియోగం తగ్గింది. అయినా ధరలు మాత్రం పెరుగుతూనే ఉన్నాయి. దీనికి కారణం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎక్సైజ్ డ్యూటీ తగ్గించకపోవడమేనన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.