శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By ఠాగూర్

టేకోవర్ నిబంధనల ఉల్లంఘన.. అంబానీ సోదరులకు అపరాధం

టేకోవర్ నిబంధనలను ఉల్లంఘించిన కేసులో అంబానీ సోదరులకు సెబీ 25 కోట్ల రూపాయల అపరాధం విధించింది. ఈ ఘటన రెండు దశాబ్దాల క్రితం జరిగింది. ఓ టేకోవర్‌లో నిబంధనల ఉల్లంఘన జరిగిందని సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా(సెబీ) తేల్చింది. దీంతో రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ, ఆయన సోదరుడు, అడాగ్ రిలయన్స్ అధినేత అనిల్ అంబానీలకు రూ.25 కోట్ల జరిమానా విధించింది. 
 
ఈ వివరాలను పరిశీలిస్తే, 2000 సంవత్సరంలో జరిగిన డీల్‌లో 5 శాతం వాటా చేతులు మారగా, దీనికి సంబంధించి సంస్థ ప్రమోటర్లు వివరాలు అందించడంలో విఫలమయ్యారని సెబీ పేర్కొంది. టేకోవర్ నిబంధనల ఉల్లంఘన జరిగిందని చెబుతూ, అంబానీ సోదరులు, వారి భార్యలు నీతా అంబానీ, టీనా అంబానీలతో పాటు మరికొన్ని కంపెనీలపైనా జరిమానా విధిస్తున్నట్టు పేర్కొంది.
 
వాస్తవానికి 5 శాతానికి మించిన లావాదేవీల వివరాలను తక్షణమే ప్రజల ముందు ఉంచాలన్న నిబంధనలుండగా, 2000 సంవత్సరంలో 6.83 శాతం ఈక్విటీకి సమానమైన షేర్లను ఆర్ఐఎల్ ప్రమోటర్లు, పీఏసీ వారంట్లతో కూడిన రిడీమబుల్ డిబెంచర్ల ద్వారా సొంతం చేసుకున్నారని సెబీ పేర్కొంది. 
 
ఈ వాటాల బదిలీ వివరాలను అదే సంవత్సరం జనవరి 7న ప్రకటించాల్సిన సంస్థ, ఎలాంటి ప్రకటనా విడుదల చేయలేదని ఆరోపించింది. ఈ కేసును విచారించిన మీదట ఫైన్ విధించామని, ఈ మొత్తాన్ని అందరూ కలిసి లేదా విడివిడిగా చెల్లించవచ్చని తెలిపింది.