శనివారం, 4 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శనివారం, 27 మార్చి 2021 (08:12 IST)

మాస్క్ లేదా... రూ.500 అపరాధం.. 144 సెక్షన్ అమలు : చత్తీస్‌గఢ్

చత్తీస్‌గఢ్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఉత్తరభారతంలో కరోనా వైరస్ వ్యాప్తి ఎక్కువగా ఉండటంతో ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు కఠిన చర్యలకు ఉపక్రమిస్తున్నాయి. ఇందులోభాగంగా, చత్తీస్‌గఢ్ ప్రభుత్వం మాస్క్ ధరించని వారికి రూ.500 అపరాధం విధించాల్సిందిగా ఆదేశాలు జారీచేసింది. 
 
నిజానికి దేశంలో కరోనా వైరస్ రెండో దశ సంక్రమణ మొదలైందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. దీంతో పలు రాష్ట్రాలు మళ్లీ ఆంక్షల దిశగా అడుగులు వేస్తున్నాయి. రాత్రిపూట కర్ఫ్యూలు, పాక్షిక లాక్డౌన్‌లు అమలు చేస్తున్నాయి. 
 
ఈ నేపథ్యంలో వైరస్ మళ్లీ చెలరేగిపోతున్నా మాస్క్ ధరించకుండా నిర్లక్ష్యం వహిస్తున్న వారిపై కొరడా ఝళిపించేందుకు చత్తీస్‌గఢ్ ప్రభుత్వం సిద్ధమైంది. మాస్క్ ధరించకుండా పట్టుబడితే ఇప్పటి వరకు వసూలు చేస్తున్న వంద రూపాయల జరిమానాను ఇప్పుడు రూ.500కు పెంచింది. ఎపిడెమిక్ డిసీజ్ యాక్ట్ 1897 ప్రకారం జరిమానాను పెంచినట్టు ఈ సందర్భంగా ప్రభుత్వం పేర్కొంది.
 
అలాగే, బహిరంగ ప్రదేశాల్లో ప్రజలు భౌతిక దూరం పాటించాలని, చేతులను ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకోవాలని సూచించింది. చత్తీస్‌గఢ్, రాయ్‌పూర్, దర్గ్, బస్తర్, రాయ్‌గఢ్ జిల్లాల్లో పండుగలు, వేడుకలు, సమావేశాల నిర్వహణపై ఆంక్షలు విధించింది. వైరస్ వ్యాప్తి ఎక్కువగా ఉన్న జిల్లాల్లో 144 సెక్షన్ విధిస్తున్నట్టు ప్రకటించింది.