శుక్రవారం, 29 నవంబరు 2024
  1. వార్తలు
  2. కెరీర్
  3. కెరీర్ వార్తలు
Written By సెల్వి
Last Updated : ఆదివారం, 15 డిశెంబరు 2019 (15:06 IST)

అరకొర నైపుణ్యంతో నెట్టుకొస్తున్న ఉద్యోగులు.. యువత అంతంత మాత్రమే

యువతలో సగం కన్నా తక్కువ మందిలోనే ఉద్యోగాలకు అవసరమైన నైపుణ్యాలు ఉన్నాయి. ముఖ్యంగా ఇంజినీరింగ్‌, ఎంబీఏ, ఫార్మసీ వంటి ఉపాధి కల్పన కోర్సులు చదువుతున్న వంద మందిలో దాదాపు సగం (46.12) మంది మాత్రమే ఉద్యోగాలు చేసే ప్రతిభ కలిగి ఉన్నారు. గత ఏడాదితో పోలిస్తే ఎంబీఏలో నైపుణ్యాలు గణనీయంగా పెరగగా, ఇంజినీంగ్‌లో మాత్రం బాగా తగ్గాయి. 
 
భారత్‌ నైపుణ్య నివేదిక-2020 ఈ కఠోర వాస్తవాలను బయటపెట్టింది. తెలంగాణ, ఏపీ రాష్ట్రాలు పలు అంశాల్లో ముందంజలో నిలవడం మాత్రమే ఆశాజనకమైన అంశం. ఏఐసీటీఈ, భారత పరిశ్రమల సమాఖ్య (సీఐఐ), వీబాక్స్‌ సంస్థ ఈ ఏడాది జులై నుంచి నవంబరు వరకు దేశ వ్యాప్తంగా ఆన్‌లైన్‌ పరీక్షలు నిర్వహించి ఈ నివేదిక రూపొందించాయి. 3,500 విద్యా సంస్థలకు చెందిన 3 లక్షల మంది విద్యార్థులు, తొమ్మిది రంగాలకు చెందిన 150 మంది కార్పొరేట్‌ అధికారులు సర్వేలో పాల్గొన్నారు.
 
 
* సర్వేలో ముఖ్యాంశాలు
 
అబ్బాయిలు పనిచేసేందుకు ఆసక్తి చూపుతున్న రాష్ట్రాల్లో మహారాష్ట్ర, తమిళనాడు, యూపీ, ఏపీ, కర్ణాటక మొదటి అయిదు స్థానాల్లో ఉన్నాయి. తెలంగాణ పదో స్థానంలో నిలిచింది.
 
 అమ్మాయిలు పనిచేసేందుకు ఇష్టపడే రాష్ట్రాల్లో తమిళనాడు, మహారాష్ట్ర, ఏపీ, కర్ణాటక, యూపీ రాష్ట్రాలు మొదటి 5 స్థానాల్లో నిలవగా, తెలంగాణ 6వ స్థానంలో ఉంది. నగరాల్లో మాత్రం  బెంగళూరు, కోయంబత్తూరు, పుణె, హైదరాబాద్‌, చెన్నై, దిల్లీ, ముంబయి, లఖ్‌నవూ ఉన్నాయి.వార్షిక వేతనం రూ.2.6 లక్షల కంటే అధికంగా ఉండాలని కోరుకుంటున్న వారి శాతం 55.
 
 
*ఈసారి ఇంటర్న్‌షిప్‌ కోరుకుంటున్న వారి శాతం 87.65కు పెరిగింది. గతేడు 83.51 శాతమే ఉండేది.
 
* అబ్బాయిలు పనిచేసేందుకు ఇష్టపడే నగరాల్లో హైదరాబాద్‌కు 8వ స్థానం. 
వివిధ అంశాల్లో తెలుగు రాష్ట్రాల పరిస్థితి
 
 
* అబ్బాయిల్లో నైపుణ్యాలు అధికంగా ఉన్న రాష్ట్రాల్లో ఏపీ 8వ స్థానంలో, తెలంగాణ 10వ స్థానంలో నిలిచాయి. అమ్మాయిల విషయంలో తెలంగాణ ప్రథమం, ఏపీకి 5వ స్థానం దక్కాయి.
 
* అబ్బాయిల్లో ఉద్యోగ నైపుణ్యాలున్న నగరాల్లో హైదరాబాద్‌ 3వ స్థానం, విశాఖపట్టణం 9వ స్థానం దక్కించుకున్నాయి. అమ్మాయిల అంశంలో హైదరాబాద్‌ ప్రథమం, విశాఖపట్టణం ద్వితీయ స్థానంలో నిలిచాయి.
 
* ఇంటర్న్‌షిప్‌ కోసం ఎక్కువ మంది ప్రాధాన్యం ఇచ్చిన రాష్ట్రాల్లో తెలంగాణ, ఏపీ మొదటి.. రెండు స్థానాల్లో ఉన్నాయి.
 
* 2016 నుంచి అత్యధిక ప్రతిభగల అభ్యర్థులను అందించే మొదటి 3 రాష్ట్రాల జాబితాలో తొలి రెండు స్థానాల్లో నిలిచిన ఆంధ్రప్రదేశ్‌కు ఈసారి చోటు దక్కలేదు. నాలుగో స్థానానికి పడిపోయింది.