శుక్రవారం, 8 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 19 మార్చి 2020 (08:37 IST)

ఇరాన్‌ 255 మంది ఇండియన్స్‌కు కరోనా - ప్రపంచ మృతులు 9 వేలు!

కరోనా వైరస్ కబళించిన దేశాల్లో ఇటలీ ఒకటి. ప్రపంచంలో అత్యధిక ప్రభావిత దేశాల్లో ఇది ఒకటి. ఇక్కడ అనేక మంది దేశవిదేశీయులు కరోనా వైరస్ బారినపడ్డారు. వీరిలో అనేక మంది మృత్యువాతకూడాపడ్డారు. దీంతో కరోనా వైరస్ అత్యధిక ప్రభావిత దేశాల్లో ఇరాన్ ఒకటిగా ఉంది. ఈ క్రమంలో ఇరాన్‌లో కొత్తగా 255 మందికి కరోనా వైరస్ సోకినట్టు కేంద్రం అధికారికంగా ప్రకటించింది. 
 
ప్రస్తుతం జరుగుతున్న లోక్‌సభ సమావేశాల్లో భాగంగా, శనివారం ఓ సభ్యుడు అడిగిన ప్రశ్నకు సమాధానంగా విదేశీ వ్యవహారాల శాఖ సహాయమంత్రి వి.మురళీధరన్ లిఖిత పూర్వక సమాధానం ఇచ్చారు. ఇరాన్‌లో మొత్తం 6 వేల మంది భారతీయులు ఉన్నారని, వారిలో 1100 మంది యాత్రికులని అందులో పేర్కొన్నారు. ఇప్పటివరకు 389 మందిని సురక్షితంగా స్వదేశానికి తీసుకువచ్చినట్టు తెలిపారు. మిగతా వారిని కూడా తీసుకురావడంపై దృష్టిసారించినట్టు చెప్పారు.
 
కాగా, ఇరాన్ నుంచి వచ్చిన వారిలో 195 మందిని రాజస్థాన్‌లోని జైసల్మేర్‌లో ఏర్పాటు చేసిన సైనిక వైద్య కేంద్రానికి తరలించారు. మరోవైపు, లడఖ్ రెజిమెంటుకు చెందిన 34 ఏళ్ల సైనికుడిలో కరోనా లక్షణాలు కనిపించడంతో అప్రమత్తమైన సైనికాధికారులు అన్ని రకాల శిక్షణ కార్యక్రమాలను రద్దు చేశారు.
 
ప్రపంచ మృతులు 9 వేలు
మరోవైపు, ఈ కరోనా మహమ్మారికి ప్రపంచవ్యాప్తంగా 8,908 మంది మరణించగా, వైరస్‌ సోకిన వారి సంఖ్య 2,16,000 దాటింది. కోలుకున్న వారి సంఖ్య 84 వేలకు చేరుకున్నది. ఇటలీలో బుధవారం ఒక్కరోజే రికార్డు స్థాయిలో 475 మంది మృత్యువాతపడ్డారు. దీంతో ఇప్పటివరకూ ఆ దేశంలో మృతుల సంఖ్య 2,978కు చేరింది.
 
మరోవైపు, కరోనా బాధితులతో ఇటలీలోని దవాఖానల్లోని ఐసీయూలు నిండిపోతున్నాయి. కొత్త బాధితుల్ని చేర్చుకోవడం అధికారులకు తలకుమించిన భారంగా మారింది. దీంతో టురిన్‌ నగరంలో కరోనా బాధితులకు ప్రోటోకాల్‌ సిద్ధం చేశారు. దాని ప్రకారం 80 ఏండ్లు పైబడిన వారికి వైద్యసాయం నిలిపివేయాలని అనుకుంటున్నారు. 
 
ఇరాన్‌లో కరోనాతో బుధవారం 147 మంది చనిపోయారు. దీంతో ఆ దేశంలో మరణాల సంఖ్య 1,135కు చేరింది. శుక్రవారం నౌరజ్‌ (పర్షియన్‌ కొత్త సంవత్సరం) నేపథ్యంలో ప్రజలు పెద్ద ఎత్తున రోడ్లపైకి వచ్చి కొనుగోళ్లు జరుపుతున్నారు. ఇండ్లకే పరిమితం కావాలన్న ప్రభుత్వం హెచ్చరికల్ని ప్రజలు పాటించకపోవడంపై ఇరాన్‌ డిప్యూటీ ఆరోగ్య శాఖ మంత్రి అలిరిజా రైసీ ఆగ్రహం వ్యక్తం చేశారు. 
 
కరోనా విషయంలో ఇరాన్‌ ఆలస్యంగా మేల్కొన్నదని వస్తున్న విమర్శలను ఆ దేశ అధ్యక్షుడు హసన్‌ రౌహానీ తోసిపుచ్చారు.  కరోనా నేపథ్యంలో సౌదీ అరేబియా, కువైట్‌, యూఏఈ వంటి దేశాలు శుక్రవారం ప్రార్థనల్ని రద్దు చేశాయి. ప్రజలందరూ ఇండ్లకే పరిమితం కావాలని ఇజ్రాయెల్‌ ప్రభుత్వం హెచ్చరించింది.   
 
స్పెయిన్‌లో 107 మంది మృతి..
కరోనాతో స్పెయిన్‌లో గత 24 గంటల్లో 107 మంది మరణించారు. దీంతో మరణాల సంఖ్య 598కు చేరుకున్నది. వైరస్‌ సోకిన వారి సంఖ్య 13,716కి పెరిగింది. దేశ రాజధాని మాడ్రిడ్‌లో అత్యధికంగా 390 మంది (66 శాతం) మరణించారని ప్రభుత్వం తెలిపింది. 
 
ఫ్రాన్స్‌లో కరోనాతో బుధవారం ఒక్కరోజే 89 మంది మరణించారు. దీంతో ఆ దేశంలో మృతుల సంఖ్య 264కు చేరింది. దక్షిణాఫ్రికాలో బుధవారం ఒక్కరోజే 31 మందికి వైరస్‌ సోకింది. దీంతో ఆ దేశంలో వైరస్‌ సోకినవారి ఈ సంఖ్య 116 చేరింది.