శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 19 మార్చి 2020 (08:27 IST)

దేశంలో ప్రబలుతున్న కరోనా మహమ్మారి.. కేంద్రం సంచలన నిర్ణయం

దేశంలో కరోనా మహమ్మారి చాపకిందనీరులా విస్తరిస్తోంది. దేశంలోని అన్ని రాష్ట్రాలకు ఈ వైరస్ వ్యాపించింది. దీంతో కేంద్ర ప్రభుత్వం అనేక కఠిన నిర్ణయాలను తీసుకుంటోంది. ఇప్పటికే పలు ప్రపంచ దేశాలకు విమాన రాకపోకలను నిలిపివేసింది. మరికొన్ని దేశాల రాకపోకలపై ఆంక్షలు విధించింది. ఈ నేపథ్యంలో తాజాగా మరో కఠిన నిర్ణయం తీసుకుంది. 
 
పది లక్షల మంది సైనికులు, పారా మిలటరీ బలగాలకు అత్యవసరేత సెలవుల్ని రద్దు చేస్తూ కేంద్ర హోంమంత్రిత్వ శాఖ సంచలన నిర్ణయం తీసుకుంది. సెలవుల నుంచి వచ్చిన వారికి వైరస్ పరీక్షలు చేస్తున్నారు. అలాగే, అత్యవసరం కాని ప్రయాణాలను, సదస్సులను రద్దు చేశారు. వ్యక్తిగత, ప్రజా భద్రత కోసం యుద్ధ సన్నద్ధతతో పనిచేయాలని బలగాను కేంద్రం ఆదేశించింది. 
 
ఇక, కరోనా వైరస్ నిర్ధారణ కోసం కేంద్రం తొలిసారిగా రోష్ డయాగ్నస్టిక్స్ ఇండియా అనే ప్రైవేటు సంస్థకు బాధ్యతలు అప్పగించింది. కాగా, లడఖ్ రెజిమెంట్‌కు చెందిన ఓ సైనికుడికి కరోనా వైరస్ సోకినట్టు నిర్ధారణ అయింది. ఇరాన్ పర్యటనకు వెళ్లొచ్చిన ఆయన తండ్రి ద్వారా ఈ వైరస్ అతడికి సోకినట్టు నిర్ధారణ అయింది. ప్రస్తుతం ఆ సైనికుడుతో పాటు.. అతని కుటుంబ సభ్యులందరినీ వైద్యుల పర్యవేక్షణలో క్వారంటైన్‌లో ఉంచారు. 
 
చెన్నైలో సీఏఏ వ్యతిరేక ర్యాలీ 
ఇదిలావుంటే, దేశంలో ఏదో ఒక మూలన సీఏఏ, ఎన్పీఆర్‌లకు వ్యతిరేకంగా నిరసనలు, ర్యాలీలు జరుగుతున్నాయి. కరోనా రక్కసి ప్రబలుతున్న తరుణంలో ఎక్కువ మంది ఒకే చోట గుమికూడవద్దంటూ ప్రభుత్వాలు హెచ్చరిస్తున్నా సీఏఏ నిరసనకారులు ఏమాత్రం పట్టించుకోవడం లేదు. 
 
చెన్నై వీధుల్లో దాదాపు ఐదు వేల మంది సీఏఏని వ్యతిరేకిస్తూ ఆందోళన చేపట్టారు. సీఏఏను ఉపసంహరించుకోవాలని మెరీనా బీచ్ సమీపంలోని చేపాక్ ప్రాంతంలో వీరు నినాదాలు చేశారు. నిరసనకారులంతా తౌహీత్ జమాత్ సంస్థకు చెందినవారు. 
 
చెన్నైతో పాటు ఇతర జిల్లాల్లో కూడా వీరు నిరసనలు చేపట్టారు. వీరు చేపట్టిన నిరసనల పట్ల స్థానికంగా తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. నిరసనలు, ఆందోళనలు చేపట్టడానికి ఇది సరైన సమయం కాదని అంటున్నారు.