బుధవారం, 15 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 22 మే 2020 (12:13 IST)

ఆంధ్రాలో 62 పాజిటివ్ కేసులు - ఏమాత్రం తగ్గని ప్రభావం

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వైరస్ కేసుల సంఖ్య విపరీతంగా పెరిగిపోతున్నాయి. తాజాగా గత 24 గంటల్లో మరో 62 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. గత 24 గంటల్లో 8,415 శాంపిళ్లను పరీక్షించగా మరో 62 మందికి కరోనా సోకినట్లు నిర్ధారణ అయిందని ఆంధ్రప్రదేశ్ వైద్య, ఆరోగ్య శాఖ ప్రకటించింది. 
 
రాష్ట్రంలో నమోదైన మొత్తం కరోనా కేసులు 2,514 అని తెలిపింది. ప్రస్తుతం ఆసుపత్రుల్లో 728 మంది చికిత్స పొందుతుండగా, ఇప్పటివరకు 1,734 మంది డిశ్చార్జ్ అయ్యారు. 24 గంటల్లో కృష్ణా జిల్లాలో కొవిడ్‌-19 వల్ల మరొకరు ప్రాణాలు కోల్పోయారు. రాష్ట్రంలో మృతుల సంఖ్య మొత్తం 55కి చేరింది. అదేసమయంలో 51 మంది డిశ్చార్జ్‌ అయ్యారని తెలిపింది.
 
 
దేశంలో దుమ్మురేపుతున్న కరోనా కేసులు 
కరోనా వైరస్ దుమ్మురేపుతోంది. ఫలితంగా రోజురోజుకూ కేసులు పెరిగిపోతున్నాయి. గత 24 గంటల్లో మరో 6,088 కొత్త పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వీటితో కలుపుకుంటే ప్రస్తుతం దేశంలో నమోదైన మొత్తం కేసుల సంఖ్య 1.18 లక్షలకు చేరుకున్నట్టు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించిన ఓ బులిటెన్‌లో పేర్కొంది. 
 
దేశంలో ఒక్క రోజులో అత్య‌ధిక స్థాయిలో కేసులు న‌మోదు కావ‌డం ఇదే తొలిసారి. ఇకపోతే, ఇప్ప‌టివ‌ర‌కు మ‌న దేశంలో క‌రోనా వ‌ల్ల మృతిచెందిన వారి సంఖ్య 3,583కి చేరుకుంది. గ‌త 24 గంట‌ల్లో 148 మంది క‌రోనా వైర‌స్ వ‌ల్ల ప్రాణాలు కోల్పోయారు. 
 
మరోవైపు, మ‌హారాష్ట్ర ప్ర‌భుత్వం కొత్త నిర్ణ‌యం తీసుకున్న‌ది. రాష్ట్ర‌వ్యాప్తంగా ప్రైవేటు హాస్పిట‌ళ్ల‌లో ఉన్న 80 శాతం బెడ్‌ల‌ను ఆగ‌స్టు 31 వ‌ర‌కు తమ ఆధీనంలోకి తీసుకుంది. ఎపిడ‌మిక్ డిసీజ్ చ‌ట్టం కింద మ‌హా ప్ర‌భుత్వం ఈ నిర్ణ‌యం తీసుకున్న‌ది. ఈ చ‌ట్టంతో ప్రైవేటు ఆస్ప‌త్రి బెడ్‌ల‌ను ప్ర‌భుత్వం త‌మ ఆధీనంలోకి తీసుకుంటుంది. చికిత్స బిల్లుల‌పై  ప్ర‌భుత్వమే ధ‌ర‌ల‌ను ఫిక్స్ చేసింది. 
 
ఇదిలావుంటే, కరోనా బారినపడి దేశవ్యాప్తంగా మృతి చెందిన వారిలో 103 మంది 30 ఏళ్లలోపు వారేనని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ విడుదల చేసిన గణాంకాలు చెబుతున్నాయి. వీరిలో 15 ఏళ్లు లోపు వారు 17 మంది ఉన్నారని ప్రభుత్వం పేర్కొంది. 
 
కరోనా బారినపడిన వీరు గుండె, కాలేయం, కిడ్నీ సంబంధిత సమస్యలతో మరణించినట్టు తెలిపింది. ఇక, గురువారం ఉదయం వరకు దేశంలో 3,435 మరణాలు సంభవించగా, వీరిలో 60 పైబడిన వారు 50.5 శాతం మంది ఉన్నారని గణాంకాల ద్వారా తెలుస్తోంది.
 
ఈ మహమ్మారి బారినపడి ప్రాణాలు కోల్పోయిన వారిలో 1,734 మంది 60 ఏళ్లు పైబడినవారు కాగా, 45-60 ఏళ్ల మధ్య వయసున్న వారు 1,205 మంది, 30-45 ఏళ్ల లోపువారు 392 మంది, 15-30 ఏళ్ల లోపు ఉన్నవారు 85 మంది ప్రాణాలు కోల్పోయారు. మొత్తం మృతుల్లో 2,500 మందికి పైగా అప్పటికే మధుమేహం, రక్తపోటు, శ్వాసకోశ, కిడ్నీ సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నారు.
 
చనిపోయిన వారిలో 2,198 పురుషులే కావడం గమనార్హం. ఇక, కరోనా మరణాల రేటు ప్రపంచదేశాలతో పోలిస్తే భారత్‌లో చాలా తక్కువగా ఉంది. ప్రపంచవ్యాప్తంగా సగటున 6.65 శాతంగా ఉన్న మరణాల రేటు భారత్‌లో మాత్రం 3 శాతానికి కొద్దిగా పైన ఉందని ప్రభుత్వం తెలిపింది.