సోమవారం, 6 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By ఐవీఆర్
Last Updated : సోమవారం, 9 మార్చి 2020 (20:18 IST)

ఇటలీ నుంచి కరోనాతో వచ్చాడు, బంధువులకి, స్నేహితులకి, థియేటర్లోనూ అంటించాడు

కరోనా వైరస్ వ్యాప్తి మన దేశంలో వేగవంతమవుతుందా... అంటే అవుననే సమాధానం వస్తోంది. ముఖ్యంగా వ్యాధి వున్న దేశాల నుంచి భారతదేశానికి వస్తున్న ప్రయాణికుల్లో కొందరు చేస్తున్న తప్పిదాల వల్ల ఆ వ్యాధి సుళువుగా వ్యాపించేస్తోంది.

కేరళ రాష్ట్రంలో ఓ కుటుంబానికి చెందిన ముగ్గురు వ్యక్తులు ఇటలీ నుంచి దోహాకి, ఆ తర్వాత దోహ నుంచి కేరళ కొచ్చికి వచ్చారు. కొచ్చి విమానాశ్రయంలో తాము దోహా నుంచి వస్తున్నట్లు చెప్పడంతో అక్కడి సిబ్బంది వారిని వదిలేశారు. వీరు అక్కడి నుంచి వచ్చింది ఫిబ్రవరి 29. ఐతే వీరికి ఇటలీలో కరోనా ఎటాక్ అయ్యింది. ఆ వ్యాధితో వీరు కేరళలో అడుగుపెట్టారు. 
 
తొలుత ఇంటికి రాగానే వారిలో ఓ యువకుడు తన స్నేహితులను పిలిచి పార్టీ ఇచ్చాడు. అప్పటికే అతడు దగ్గు, జ్వరంతో బాధపడుతున్నాడు. అలాగే స్నేహితులకు పార్టీ ఇచ్చాడు. అదేరోజు రాత్రి వారితో కలిసి సినిమాకు వెళ్లాడు. మరి అక్కడ అది ఎంతమందికి అంటుకున్నదో తెలియదు. ఆ తర్వాత చర్చికి వెళ్లాడు. అక్కడ కూడా ఇదే స్థితి. జ్వరం, దగ్గు, వాంతులు కూడా ప్రారంభమయ్యాయి. అలాగే తన బంధువుల ఇళ్లన్నీ చుట్టేశాడు తన పేరెంట్స్‌తో కలిసి. 

ఆరోజు అతడి తల్లిదండ్రులు తీవ్ర అస్వస్థతకు గురవడంతో ఆసుపత్రిలో చెక్ చేయించగా కరోనా వైరస్ అని తేలింది. కానీ ఈలోపు వీరు చాలామందికి అంటించేశారు. ఇప్పుడు కేరళ ప్రభుత్వం వారందరినీ ఎలా ట్రేస్ చేయాలో అర్థంకాక తలలు పట్టుకున్నది. కరోనా పీడిత దేశాల నుంచి వచ్చేవారు తమకు వ్యాధి వున్నదో లేదో చెక్ చేయించుకోకుండా ఇలా వచ్చేయడంతో మరిన్ని సమస్యలు ఎదురవుతున్నాయి. 
 
ఇదిలావుంటే మొన్నటివరకూ 20 మందికి కరోనా వున్నదని అనుకుంటుంటే.. అది ఇవాళ 43కి చేరింది. ప్రపంచవ్యాప్తంగా ఒక లక్షల మందికి పైగా ఈ వ్యాధి నిర్థారణ అవగా ఇప్పటివరకూ 3,825 మంది మృత్యువాత పడ్డారు. సుమారు 90 దేశాల్లో కరోనా కల్లోల సృష్టిస్తోంది.