ఆదివారం, 24 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 31 మార్చి 2020 (19:24 IST)

జార్ఖండ్‌లో తొలి కరోనా కేసు... ఇటలీలో మరణ మృదంగం

కరోనా వైరస్ మనదేశంలో కూడా శరవేగంగా విస్తరిస్తోంది. గత 24 గంటల్లో ఏకంగా 227 కేసులు నమోదయ్యాయి. అలాగే, ఈ వైరస్ బారినపడి చనిపోయిన వారి సంఖ్య 41కు చేరింది. ఈ విషయాన్ని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. అలాగే, జార్ఖండ్ రాష్ట్రంలో తొలి కరోనా కేసు నమోదైంది. దీంతో కలుపుకుని దేశంలో మొత్తం నమోదైన కేసుల సంఖ్య 1429కి చేరింది. అలాగే, చనిపోయిన వారి సంఖ్య 41కు చేరింది. 
 
ఇదే అంశంపై ఆరోగ్య శాఖ ఒక ప్రకటన విడుదల చేసింది. కరోనా చికిత్సలో భాగంగా 15 వేల మంది నర్సులకు ఆన్‌లైన్‌లో శిక్షణ ఇస్తున్నామని, కరోనా చికిత్సకు ఎయిమ్స్‌తో కలిసి వైద్యబృందాలు ఏర్పాటు చేస్తున్నామని పేర్కొంది. 
 
దేశం మొత్తమ్మీద కరోనా నిర్ధారణకు 123 పరీక్ష కేంద్రాలు పనిచేస్తున్నాయని, ఇప్పటివరకు 43 వేల మందికి పరీక్షలు నిర్వహించామని వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. అలాగే, మాస్కులు, శానిటైజర్లు, వైద్యపరికరాల కొరత లేకుండా చర్యలు తీసుకుంటున్నట్టు తెలిపింది. 
 
దక్షిణ కొరియా, వియత్నాం, టర్కీ నుంచి వైద్య పరికరాలు రప్పిస్తున్నామని కేంద్రం వెల్లడించింది. కరోనా బాధితులతో కలిసి ఉన్నవారి వివరాలు వేగంగా సేకరిస్తున్నామని, ఈ విషయంలో రాష్ట్రాలు బాగా సహకరిస్తున్నాయని వివరించింది.
 
మరోవైపు, వలస కూలీలపై కూడా కేంద్ర హోంశాఖ స్పందించింది. వలసకూలీల కోసం 21 వేల సహాయ శిబిరాలు ఏర్పాటు చేసినట్టు వెల్లడించింది. ఇప్పటివరకు 6.66 లక్షల మందికి వసతి ఏర్పాటు చేశామని, 23 లక్షల మంది కూలీలకు ఆహారం అందించామని వివరించింది. వలస కూలీల సమస్య ప్రస్తుతం అదుపులోనే ఉందని పేర్కొంది. 
 
ఇంకోవైపు, ఆరు కోట్ల జనాభా కలిగిన ఇటలీలో కరోనా వైరస్ మరణ మృదంగం కొనసాగిస్తోంది. ఇటలీలో కరోనా వైరస్ ప్రభావంతో 11,591 మంది మరణించగా, స్పెయిన్‌లో 8,189 మంది మృత్యువాత పడ్డారు. చైనాలో మృతుల సంఖ్య 3,305గా నమోదైంది. పాజిటివ్ కేసులు లక్ష దాటిన అమెరికాలో మరణాల రేటు తగ్గడం ఓ ఊరట. అమెరికాలో కరోనా మృతుల సంఖ్య 3,173.
 
ఇక, ఫ్రాన్స్‌లోనూ కరోనా మృత్యుఘంటికలు మోగిస్తోంది. అక్కడ 3,024 మంది ప్రాణాలు కోల్పోగా, ఇరాన్‌లో 2,898 మంది బలయ్యారు. బ్రిటన్‌లో 1,408, నెదర్లాండ్స్‌లో 864, జర్మనీలో 651 మంది మరణించినట్టు గణాంకాలు చెబుతున్నాయి. కాగా, ప్రపంచవ్యాప్తంగా కరోనా సోకినవారి సంఖ్య 8.01 లక్షలకు చేరింది. అలాగే, మరణాల సంఖ్య కూడా 38,749గా ఉన్నట్టు పేర్కొంటున్నాయి.