శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 31 మార్చి 2020 (19:18 IST)

కేసీఆర్‌ను అనుసరించిన జగన్.. ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల వేతనాల్లో తగ్గింపు...

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ను ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి అనుసరించారు. కరోనా వైరస్ మహమ్మారి కారణంగా దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్ ప్రకటించారు. దీనికితోడు కరోనా మహమ్మారిని అడ్డుకోవడానికి భారీ ఎత్తున నిధులు ఖర్చు చేస్తున్నారు. దీంతో రాష్ట్ర ఖజానాపై ఆర్థికభారం పడింది. 
 
ఈ నేపథ్యంలో జగన్ ప్రభుత్వం సంచలనాత్మక నిర్ణయం తీసుకుంది. ఏపీలో ఉద్యోగుల జీతాలను రెండు వాయిదాల్లో చెల్లించాలని నిర్ణయించింది. ప్రజాప్రతినిధుల జీతాల్లో వందశాతం తగ్గింపు విధిస్తున్నట్లు తెలిపింది. ఆలిండియా సర్వీస్‌ అధికారుల వేతనాల్లో 60 శాతం, ఉద్యోగుల జీతాల్లో 50 శాతం తగ్గింపు విధించింది. 
 
దీనికి సంబంధించి మంగళవారం సాయంత్రం ప్రభుత్వం అధికారికంగా ఉత్తర్వులు విడుదల చేయనుంది. కాగా తగ్గింపు విధించిన జీతాన్ని సంక్షోభం నుంచి బయటపడిన తర్వాత చెల్లించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అంటే మార్చి నెల వేతనాన్ని రెండు దఫాలుగా చెల్లించనుంది. 
 
మరోవైపు, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇదే తరహా నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ రంగ సంస్థల, ప్రభుత్వ గ్రాంటు పొందుతున్న సంస్థల ఉద్యోగుల మార్చి నెల వేతనాల్లో కొంత మొత్తంపై తగ్గింపు విధించనుంది. ఇందుకు సంబంధించిన జీవోను విడుదల చేసింది. ఇలా తగ్గింపు విధించిన మొత్తాన్ని రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మెరుగుపడ్డాక వారికి తిరిగి చెల్లిస్తారని అధికార వర్గాల సమాచారం. ఈ జీవో ప్రకారం ఎవరి వేతనాల్లో ఎంత శాతం తగ్గింపు విధిస్తారన్న వివరాలను స్పష్టం చేసింది.