శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By సెల్వి
Last Updated : శనివారం, 8 మే 2021 (20:21 IST)

కరోనా రక్కసి మరణ మృదంగం.. ఏపీలో 96 మంది మృతి

దేశంలో కరోనా రక్కసి మరణ మృదంగం కొనసాగుతోంది. ఒక్కరోజులో నాలుగు వేలకు పైగా మరణాలు సంభవించిన మూడో దేశంగా ఉంది. గతంలో అమెరికా, బ్రెజిల్‌లోనే ఒకరోజులో నాలుగువేలకు పైగా మరణాలు సంభవించాయి.

దేశంలో కరోనా ప్రవేశించినప్పటి నుంచి ఈ స్థాయిలో మరణాలు నమోదవడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. వరుసగా మూడోరోజూ నాలుగు లక్షలకు పైగా కొత్త కేసులు నమోదయ్యాయి. 
 
గత 24 గంటల్లో దేశవ్యాప్తంగా 18,26,490 మందికి వైరస్‌ పరీక్షలు నిర్వహించగా.. 4,01,078 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. 4,187 మరణాలు సంభవించాయి. దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 2,18,92,676కు, మరణాల సంఖ్య 2,38,270కు చేరుకుంది. మరణాల రేటు 1.09శాతంగా ఉంది. 
 
గత 24 గంటల్లో దాదాపు 3,18,609 మంది కరోనా నుంచి కోలుకున్నారు. మొత్తం రికవరీల సంఖ్య 1.79కోట్లకు చేరగా, రికవరీ రేటు 81.95శాతంగా ఉంది. క్రియాశీల కేసులు 37లక్షలు దాటాయి. ప్రస్తుతం 37,23,446 మంది వైరస్‌కు చికిత్స తీసుకుంటుండగా, క్రియాశీల రేటు 16.96 శాతంగా ఉంది.
 
ఏపీలో కరోనా కేసులు మరోసారి పెరిగాయి. ఇవాళ కొత్తగా 20,065 కరోనా కేసులు నమోదయ్యాయి. వైరస్‌ బారిన పడి రికార్డు స్థాయిలో 96 మంది మృతి చెందారు. ఏపీలో మొత్తం పాజిటివ్‌ కేసులు 12,65,439కు పెరిగింది. రాష్ట్రంలో మొత్తం 8,615 మంది మృతి చెందారు. గడిచిన 24 గంటల వ్యవధిలో 1,01, 571 పరీక్షలు నిర్వహించినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది.