శనివారం, 30 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 13 ఏప్రియల్ 2020 (09:42 IST)

భారత్‌లో యాక్టివ్ కరోనా కేసులెన్ని? తెలుగురాష్ట్రాల పరిస్థితేంటి?

కరోనా వైరస్ వ్యాప్తి ఏమాత్రం తగ్గుముఖం పట్టడం లేదు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నో రకాలైన చర్యలు తీసుకుంటున్నప్పటికీ... ప్రతి రోజూ నమోదవుతున్న కేసుల సంఖ్య భారీగానే ఉంది. సోమవారం ఉదయం 8 గంటల సమయానికి దేశవ్యాప్తంగా 7,987 యాక్టివ్ కేసులు ఉన్నాయని కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. వీరందరికీ వివిధ ఆసుపత్రుల్లో చికిత్సలు జరుగుతున్నాయి. 
 
ఇక కరోనా సోకిన తరువాత చికిత్స పొందిన 856 మంది నెగటివ్ వచ్చి డిశ్చార్జ్ అయ్యారు. ఇదే సమయంలో 308 మంది మరణించారు. ఒక వ్యక్తి తన స్వదేశానికి వెళ్లిపోయారని కేంద్రం ప్రకటించింది. కాగా, కరోనా కేసుల్లో మహారాష్ట్ర తొలి స్థానంలో ఉండగా, ఢిల్లీ రెండో స్థానంలో నిలిచిందన్న సంగతి తెలిసిందే.
 
మరోవైపు, తెలంగాణలో గత బుధవారం నుంచి తగ్గినట్టే తగ్గిన కరోనా కేసులు, తిరిగి విజృంభించడం ప్రజల్లో ఆందోళన పెంచింది. 24 గంటల వ్యవధిలో రెండు జిల్లాల్లో 22 కేసులు నమోదయ్యాయి. సూర్యాపేట, వికారాబాద్ జిల్లాల్లో 11 చొప్పున కేసులు నమోదయ్యాయి. ఇదేసమయంలో వికారాబాద్‌ జిల్లాలో తొలి మరణం నమోదైంది. శని, ఆదివారాల్లో పాజిటివ్ వచ్చిన కరోనా కేసుల్లో అత్యధికం కాంటాక్టు కేసులే కావడం గమనార్హం. 
 
అలాగే, ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వైరస్ ప్రతాపాన్ని చూపిస్తోంది. అక్కడ ప్రతి రోజూ పదుల సంఖ్యలో కేసులు నమోదవుతుండడం ఆందోళన కలిగిస్తోంది. ఆదివారం కొత్తగా మరో 22 కేసులు నమోదు కావడంతో రాష్ట్రంలో మొత్తం నమోదైన కేసుల సంఖ్య 427కు చేరుకుంది. ఆదివారం గుంటూరులో 14, నెల్లూరులో 4, కర్నూలులో 2, చిత్తూరు, కడప జిల్లాలో ఒక్కోటి చొప్పున నమోదయ్యాయి.