ఆదివారం, 12 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 4 మే 2020 (09:40 IST)

కర్నూలులో తగ్గని కరోనా జోరు - 24 గంటల్లో 30 పాజిటివ్ కేసులు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కర్నూలు జిల్లాలో కరోనా జోరు ఏమాత్రం తగ్గడం లేదు. గత 24 గంటల్లో ఏకంగా మరో 30 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో కర్నూలు జిల్లా వాసులు హడలిపోతున్నారు. రాష్ట్రంలోనే అత్యధిక పాజిటివ్ కేసులు నమోదైన జిల్లాగా కర్నూలు ఉన్న విషయం తెల్సిందే. 
 
ఏపీలో శనివారం - ఆదివారాల మధ్య కొత్తగా 58 కేసులు నమోదైతే అందులో 30 మంది కర్నూలు వారే ఉండడం ఆందోళన కలిగిస్తోంది. తాజా కేసులతో కలుపుకుని జిల్లాలో నమోదైన మొత్తం కేసుల సంఖ్య 466కు పెరిగింది. 
 
ఆ తర్వాతి స్థానంలో గుంటూరు ఉంది. ఇక్కడ కొత్తగా 11 మందికి వైరస్ సోకడంతో మొత్తం బాధితుల సంఖ్య 319కి పెరిగింది. 266 కేసులతో కృష్ణా మూడో స్థానంలో ఉండగా, నెల్లూరు (91), కడప (83) టాప్-5లో ఉన్నాయి. నిన్నమొన్నటి వరకు ఒక్క కేసు కూడా లేని శ్రీకాకుళంలో ప్రస్తుతం ఐదు కేసులు నమోదయ్యాయి.
 
తెలంగాణాలో కొత్తగా 21... 
కరోనా వైరస్ వేగం ఏమాత్రం తగ్గడం లేదు. దేశ వ్యాప్తంగా ఆదివారం కూడా కొత్తగా మరో రెండున్నర వేల కేసులు నమోదయ్యాయి. అలాగే, మరణాలు కూడా గతంలో ఎన్నడూ లేనంతగా ఏకంగా 83 మంది కరోనా రోగులు చనిపోయారు. ఇకపోతే, తెలంగాణ రాష్ట్రంలో కూడా కొత్తగా మరో 21 కేసులు నమోదయ్యాయి. ఈ కేసులతో కలుపుకుని మొత్తం కేసుల సంఖ్య 1082కు చేరింది. 
 
ఆదివారం నమోదైన 21 కొత్త కేసుల్లో ఒక్క జీహెచ్ఎంసీ పరిధిలోనే 20 కేసులు నమోదు కావడం గమనార్హం. అలాగే, జగిత్యాల్ జిల్లాలో ఓ పాజిటివ్ కేసు వెలుగుచూసింది. అదేవిధంగా 46 మంది డిశ్చార్జి అయ్యారు. ప్రస్తుతం 508 మంది చికిత్స పొందుతున్నారు. ఇప్పటివరకు రాష్ట్రంలో మొత్తం 29 మంది చనిపోయారు. 
 
కాగా, ఇప్పటివరకు తెలంగాణలోని వరంగల్ రూరల్, యాదాద్రి, వనపర్తి జిల్లాల్లో ఒక్క కేసు కూడా నమోదు కాలేదు. అంతేకాదు, 17 జిల్లాల్లో గత 14 రోజులుగా ఒక్కరికీ కరోనా పాజిటివ్ కేసు కూడా వెలుగు చూడలేదు. దీంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. 
 
దేశంలో 2487 పాజిటివ్ కేసులు..
మరోవైపు, దేశంలో కరోనా వైరస్ మహమ్మారి మరింత తీవ్రరూపం దాల్చిందని చెప్పొచ్చు. ఇప్పటివరకు లేనివిధంగా ఒక్కరోజులోనే గరిష్ట కేసులు నమోదయ్యాయి. గడచిన 24 గంటల్లో 2,487 మందికి కొత్తగా కరోనా నిర్ధారణ అయింది. దాంతో దేశంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 40,263కి పెరిగింది. 
 
ఆదివారం దేశవ్యాప్తంగా 83 మరణాలు సంభవించాయి. దాంతో ఇప్పటివరకు ఈ వైరస్ భూతానికి బలైన వారి సంఖ్య 1306గా నమోదైంది. ఆదివారం 869 మంది డిశ్చార్జి కాగా, 28,070 మంది చికిత్స పొందుతున్నారు.
 
ఇక రాష్ట్రాల వారీగా చూస్తే, మహారాష్ట్రలో అత్యధికంగా 12,296 కేసులు నమోదయ్యాయి. 521 మంది మృత్యువాత పడ్డారు. ఆ తర్వాత స్థానంలో గుజరాత్ ఉంది. గుజరాత్‌లో 5,055 మందికి కరోనా సోకగా, 262 మంది మరణించారు. 
 
ఆ తర్వాత స్థానంలో గుజరాత్ ఉంది. ఈ రాష్ట్రంలో 5055 కేసులు నమోదయ్యాయి. అలాగే, ఢిల్లీలో 4122, మధ్యప్రదేశ్‌లో 2846, రాజస్థాన్‌లో 2772, తమిళనాడులో 2757, ఉత్తరప్రదేశ్‌లో 2626, ఆంధ్రప్రదేశ్‌లో 1583, తెలంగాణాలో 1063, వెస్ట్ బెంగాల్‌లో 922 చొప్పున కేసులు నమోదయ్యాయి.