కరోనా కరాళ నృత్యంతో దేశంలో రికార్డు.. పీజీ హాస్టల్ వంట మనిషికి పాజిటివ్
దేశంలో కరోనా వైరస్ కరాళ నృత్యం చేస్తోంది. ఫలితంగా ఒకే రోజులో రికార్డు స్థాయిలో కొత్త పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. గత 24 గంటల్లో దేశంలో ఎన్నడూ నమోదుకాని రీతిలో ఈ కరోనా కేసులు నమోదయ్యాయి. ఈ విషయాన్ని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. ఈ శాఖ తాజాగా విడుదల చేసిన గణాంకాల మేరకు గత 24 గంటల్లో 2,293 కేసులు నమోదయ్యాయి. అదేసమయంలో 71 మంది ప్రాణాలు కోల్పోయారు.
దీంతో దేశంలో కరోనా మృతుల సంఖ్య మొత్తం 1,218కి చేరింది. దీంతో కరోనా కేసుల సంఖ్య ఇప్పటివరకు మొత్తం 37,336కు చేరింది. ఇప్పటి వరకు కరోనా నుంచి 9,950 మంది కోలుకున్నారు. ఆసుపత్రుల్లో 26,167 మంది చికిత్స పొందుతున్నారు.
మరోవైపు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కర్నూలు జిల్లాలో కరోనా వైరస్ కలకలం రేపుతోంది. ఇప్పటికే రికార్డు స్థాయిలో 411 కరోనా కేసులు నమోదైవున్నాయి. తాజాగా కర్నూలు వైద్య కాలేజీలోని పీజీ హాస్టల్‌లో పనిచేసే వంట మనిషికి కరోనా సోకింది.
స్థానిక వర్గాలు అందించిన సమాచారం మేరకు ఆమెకు జరిపిన వైద్య పరీక్షల్లో కరోనా పాజిటివ్ అని తేలింది. దీంతో హాస్టల్‌లో ఉన్న విద్యార్థులందరికీ కరోనా పరీక్షలు చేయనున్నారు. ఆ తర్వాత వీరిని హోం క్వారంటైన్‌లో ఉంచాలా లేక ఐసోలేషన్‌కు తరలించాలా? అనే విషయంపై తుది నిర్ణయం తీసుకుంటామని స్థానిక అధికారులు వెల్లడించారు.