శుక్రవారం, 8 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 27 ఏప్రియల్ 2020 (12:54 IST)

ఏపీలో కరోనా విజృంభణ.. మరో 80 కేసులు.. వైకాపా నేతలే కారణమా?

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తి శరవేగంగా సాగుతోంది. గత 24 గంటల్లో మరో 80 కోవిడ్ కేసులు నమోదయ్యాయి. ఈ కేసులతో కలుపుకుని మొత్తం కరోనా కేసుల సంఖ్య 1177కు చేరాయి. గడిచిన 24 గంటల్లో నమోదైన 80 కరోనా కేసుల్లో కర్నూలులో 13, గుంటూరులో 23, కృష్ణాలో 33, వెస్ట్ గోదావరిలో 3, శ్రీకాకుళంలో 1, నెల్లూరులో 7 కేసులు చొప్పున నమోదయ్యాయి. 
 
అయితే, విజయనగరం జిల్లాలో మాత్రమే ఇప్పటివరకు ఒక్క కేసు కూడా నమోదు కాలేదు. దీంతో రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య  మొత్తం 1,177కి చేరింది. కర్నూలులో అత్యధికంగా 292, ఆ తర్వాత గుంటూరులో 237 కరోనా కేసులు నమోదయ్యాయి. కాగా, ఏపీలో ఇప్పటివరకు మృతుల సంఖ్య 31కి చేరింది. ప్రస్తుతం ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న వారి సంఖ్య 911గా ఉంది. 235 మంది కరోనా నుంచి కోలుకున్నారు.

జిల్లాల వారీగా కేసులను పరిశీలిస్తే, అనంతపురంలో 53, చిత్తూరులో 73, ఈస్ట్ గోదావరి 39, గుంటూరు 237, కడప 58, కృష్ణ 210, కర్నూలు 292, నెల్లూరు 79, ప్రకాశం 56, శ్రీకాకుళం 4, విశాఖపట్టణం 22, వెస్ట్ గోదావరిలో 54 చొప్పున కేసులు నమోదయ్యాయి. 
 
అయితే, ఏపీలో కరోనా వైరస్ వ్యాప్తినికి ప్రధాన కారకులుగా వైకాపా నేతలేనంటూ ప్రచారం సాగుతోంది. కరోనా కిట్స్, ఆర్థిక సాయం, ఇతర నిత్యావసర వస్తువుల పంపిణీ పేరుతో వైకాపా నేతలు సామాజిక భౌతికదూరాన్ని పాటించకుండా ఇష్టానుసారంగా నడుచుకుంటున్నారు. ఈ కారణంగానే కరోనా వైరస్‌కు ఏమాత్రం అడ్డుకట్ట పడటం లేదనే ఆరోపణలు ఉన్నాయి. 
 
తాజాగా కూడా కర్నూలు ఎంపీ కుటుంబంలో కూడా ఆరుగురు సభ్యులకు ఈ వైరస్ సోకింది. వీరిలో 89 యేళ్ళ ఎంపీ తండ్రి కూడా ఉన్నారు. ఈయన పరిస్థితి సీరియస్‌గా ఉండటంతో ఆయన్ను హైదరాబాద్ ఆస్పత్రికి తరలించారు. పైగా, ఈ ఆరుగురు సభ్యుల్లో నలుగురు వైద్యులు కావడం గమనార్హం.