బుధవారం, 27 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By ఠాగూర్

కరోనాకు తోడు బ్లాక్ ఫంగస్.. కంటి చూపును హరిస్తోంది...

అసలే కరోనా వైరస్ దెబ్బకు ప్రజలు వణికిపోతున్నారు. ఇపుడు కొత్తగా బ్లాక్ ఫంగస్ ఒకటి కొత్తగా వెలుగులోకి వచ్చింది. మహారాష్ట్ర, గుజరాత్‌లలో కొవిడ్‌-19 నుంచి కోలుకున్నవారిలో ‘బ్లాక్‌ ఫంగస్‌’ (మ్యూకోర్‌మైకోసిస్‌) ఇన్‌ఫెక్షన్‌ కేసులు పెరుగుతున్నాయని వైద్యులు వెల్లడించారు. ఈ ఫంగస్ దెబ్బకు అనేక మంది కంటి చూపును కోల్పోతున్నట్టు తెలిపారు. 
 
ఈ ఇన్‌ఫెక్షన్‌ను నయం చేయడానికి అవుతున్న ఖర్చు కూడా ఆందోళన కలిగిస్తోందని చెప్పారు. మూడు వారాల కిందట కరోనా నుంచి కోలుకున్న ఒక వ్యక్తిలో ఈ ఫంగల్‌ ఇన్‌ఫెక్షన్‌ను గుర్తించామని సూరత్‌కు చెందిన ఒక ఆసుపత్రి అధిపతి మాథుర్‌ సవాని చెప్పారు. 
 
'ఇప్పుడు మా ఆసుపత్రిలో ఈ కేసులు సంఖ్య 50కి పెరిగిపోయింది. మరో 60 మంది చికిత్స కోసం ఎదురుచూస్తున్నారు' అని ఆయన తెలిపారు. ఈ సమస్యతో సూరత్, గుజరాత్‌లోని ఇతర ప్రాంతాల నుంచి బాధితులు తమ ఆసుపత్రికి వస్తున్నారని చెప్పారు. వీరంతా కొవిడ్‌ నుంచి ఇటీవల కోలుకున్నవారేనని తెలిపారు. 
 
బాధితుల్లో ఏడుగురు కంటి చూపును కోల్పోయారని పేర్కొన్నారు. ఈ ఫంగల్‌ ఇన్‌ఫెక్షన్‌ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో సూరత్‌ ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రత్యేక కేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు వైద్యాధికారి కేతన్‌ నాయక్‌ చెప్పారు. 
 
మహారాష్ట్రలో ఈ ఫంగల్‌ ఇన్‌ఫెక్షన్ల వల్ల కనీసం 8 మంది దృష్టిని కోల్పోయారని రాష్ట్ర వైద్య విద్య, పరిశోధన డైరెక్టరేట్‌ అధిపతి తాత్యారావు లహానే చెప్పారు. ‘‘వారు కొవిడ్‌పై విజయం సాధించారు. కానీ వారిలోని బలహీనమైన రోగ నిరోధక వ్యవస్థపై ఫంగల్‌ ఇన్‌ఫెక్షన్‌ దాడి చేసింది’’ అని తెలిపారు.