బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 18 ఫిబ్రవరి 2021 (17:34 IST)

అమరావతిలో కరోనా ఉధృతి.. ఏ క్షణమైనా లాక్డౌన్?

మహారాష్ట్రలో కరోనా వైరస్ మళ్లీ విజృంభిస్తోంది. ముఖ్యంగా, ఈ రాష్ట్రంలోని యావత్మల్‌, అమరావతితో పాటు అకోలా నగరాల్లో కరోనా పరిస్థితి మరింత అధ్వాన్నంగా ఉంది. దీంతో ప్రభుత్వం ఏ క్షణంలోనైనా లాక్డౌన్‌ విధించే అవకాశాలు ఉన్నాయని జాతీయ మీడియా వర్గాలు పేర్కొంటున్నాయి. 
 
ఈ మేరకు కరోనా పరిస్థితిపై సీఎం ఉద్ధవ్‌ ఠాక్రే, డిప్యూటీ సీఎం అజిత్‌ పవార్‌తో చర్చించారని, ఇందుకు అనుగుణంగా చర్యలు తీసుకునే అవకాశం ఉందని అధికార వర్గాలు తెలిపాయి. 
 
కాగా, గత కొన్ని రోజులుగా దేశ వ్యాప్తంగా కరోనా వైరస్ కేసులు తగ్గుముఖం పట్టాయి. కానీ, మహారాష్ట్రలో కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. ఇప్పటికే ప్రభుత్వం కేరళ నుంచి వచ్చే వారిపై ఆంక్షలు విధించింది. కేరళీయులు రాష్ట్రంలోకి వచ్చే సమయంలో కొవిడ్‌ నెగెటివ్‌ రిప్టోర్ట్‌ చూపాలని స్పష్టం చేసింది. 
 
గత నవంబర్‌ 23 నుంచి ఢిల్లీ, రాజస్థాన్‌, గోవా, గుజరాత్‌ రాష్ట్రాలకు సైతం ప్రయాణ ఆంక్షలు ఇప్పటికే అమలులో ఉన్నాయి. మహారాష్ట్రలో బుధవారం కొత్తగా 4,787 కొవిడ్‌ పాజిటివ్‌ కేసులు నిర్ధారణ అయ్యాయి. ఈ ఏడాదిలో తొలిసారిగా అత్యధికంగా ఒకే ఇంత పెద్ద మొత్తంలో కేసులు నమోదవడం ఇదే తొలిసారి. 
 
అమరావతి జిల్లాలో మంగళవారం 82 పాజిటివ్‌ కేసులు నమోదైతే.. బుధవారం 230 రికార్డయ్యాయి. ప్రజలు కొవిడ్‌ నిబంధనలు పాటించకపోతే మరోసారి లాక్డౌన్‌కు సిద్ధంగా ఉండాలని సీఎం ఉద్దవ్‌ ఠాక్రే మంగళవారం హెచ్చరించిన విషయం తెలిసిందే.