మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By సెల్వి
Last Updated : సోమవారం, 15 ఫిబ్రవరి 2021 (12:51 IST)

మహారాష్ట్రలో డేంజర్ బెల్స్.. 24 గంటల్లో 4వేల పాజిటివ్ కేసులు

దేశవ్యాప్తంగా కరోనా తీవ్రత కొంత తగ్గింది. కానీ మహారాష్ట్రలో మళ్లీ కరోనా వైరస్ కేసులు పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తున్నది. మహారాష్ట్రలో గత 24 గంటల్లో 4 వేల పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. ఒకే రోజులో 40 మంది మరణించారు. 
 
ఇప్పటి వరకు మహారాష్ట్రలో వైరస్ సోకిన వారి సంఖ్య 20,64,278కి చేరింది. ఇక ఆ రాష్ట్రంలో మొత్తం మరణాల సంఖ్య 51,529కి చేరినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. నిన్న ఒక్క రోజులో సుమారు 1,355 మంది రోగులను డిశ్చార్జ్ చేశారు. దీంతో రాష్ట్రంలో రికవరీ కేసుల సంఖ్య 19,75,603కి చేరింది. రాష్ట్రవ్యాప్తంగా ఇంకా 35,965 పాజిటివ్ కేసులు ఉన్నాయి.
 
అయితే భారతదేశ వ్యాప్తంగా గడిచిన 24 గంటల్లో 11,649 కరోనా కేసులు నమోదైనట్టు కేంద్ర ఆరోగ్యశాఖ సోమవారం వెల్లడించింది. కొత్తగా నమోదైన కేసులతో మొత్తం కేసుల సంఖ్య 1,09,16,589కు చేరుకుంది. మరోపక్క గడిచిన 24 గంటల్లో కరోనా బారిన పడి 90 మంది మృతిచెందారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 1,55,732గా ఉంది. ఇప్పటివరకు కరోనా నుంచి 1,06,21,220 మంది పూర్తిగా కోలుకున్నారు.
 
 ప్రస్తుతం దేశంలో 1,39,637 యాక్టివ్ కేసులున్నాయి. సెప్టెంబర్ నెలాఖరు నుంచి దేశంలో కరోనా కేసుల సంఖ్య తగ్గుతూ వస్తోంది. వ్యాక్సినేషన్ ప్రక్రియ కూడా దేశవ్యాప్తంగా కొనసాగుతుండటంతో కరోనాను భారత్ నియంత్రించగలుగుతోంది.