మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 16 ఫిబ్రవరి 2021 (12:37 IST)

కరోనాకు చికిత్స.. లక్షలు గుంజేసిన ఆస్పత్రి.. ట్యాబ్లెట్ కూడా ఇవ్వలేదట..

కరోనా పేరిట ఆస్పత్రులు డబ్బులు బాగానే గుంజేస్తున్నాయి. ఏదో చికిత్స చేసి కొన్ని ఆస్పత్రులు లక్షలు గుంజేస్తున్నాయి. అయితే ఓ ఆస్పత్రి ఎలాంటి చికిత్స చేయకుండా.. కనీసం మాత్రలు కూడా ఇవ్వకుండా భారీ బిల్లు వేసేసింది. మహారాష్ట్రలోని పూణెలో ఓ ఆసుపత్రి చేసిన నిర్వాకం బయటకు వచ్చి అందరినీ నోరెళ్లబెట్టేలా చేసింది.
 
కరోనా రోగులకు కనీసం ఒక్కటంటే ఒక్క ట్యాబ్లెట్ కూడా వేయకుండానే ఏకంగా కోట్ల కొద్దీ బిల్లులు వేసిన ఘటన షాకింగ్‌కు గురించేస్తోంది. ఆ ఆస్పత్రిలో జాయిన్ అయిన కరోనా రోగులకు ఏమాత్రం చికిత్స చేయకుండానే చేసినట్టు బిల్డప్ ఇచ్చింది. కానీ..ట్రీట్‌మెంట్ చేసినట్లుగా ఫేక్ బిల్లులు సృష్టించి..కోట్ల కొద్దీ బిల్లులు వేసింది.
 
పూణెలోని స్పర్శ్ మల్టీస్పెషాలిటీ ఆసుపత్రి ఏకంగా రూ.5.26 కోట్ల బిల్లులు వేసి వాటిని అధికారులకు సమర్పించింది. దీంతో అవాక్కయిన అధికారులు విచారణ జరపటంతో షాకింగ్ విషయాలు బైటపడ్డాయి. అసలా ఆసుపత్రి ఒక్క రోగికి కూడా చికిత్స చేయలేదని విచారణలో తేలింది. సదరు ఆసుపత్రికి రెండు కరోనా సెంటర్లు ఉండగా, ఒక్కదాంట్లో కూడా ఒక్క రోగికి కూడా చికిత్స అందించలేదని, ఒక్కటంటే ఒక్క ట్యాబ్లెట్ కూడా ఇచ్చిన పాపాన కూడా పోలేదని తెలిసి అధికారులు అవాక్కయ్యారు.
 
దీంతో ఈ బిల్లుల వెనకున్న గూడుపుఠాణీని తెలుసుకునేందుకు పింప్రి-చించ్వాడ్ మునిసిపాలిటీ కార్పొరేషన్ రంగంలోకి దిగింది. కేసు దర్యాప్తు కోసం ముగ్గురు సభ్యులతో కూడిన కమిటీని ఏర్పాటు చేసింది. అనంతరం ఆ కమిటీ సభ్యులు విచారణ చేపట్టారు. ఈ విచారణలో సదరు ఆస్పత్రి నిర్వహిస్తున్న కరోనా సెంటర్లలో ఒక సెంటర్ లో ఒక్క కరోనా పేషెంట్ కు కూడా ట్రీట్ మెంట్ చేయలేదని నివేదికలో వెల్లడైంది.