సోమవారం, 25 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 29 డిశెంబరు 2020 (08:44 IST)

తెలుగు రాష్ట్రాలను వణికిస్తున్న కరోనా స్ట్రెయిన్!

తెలుగు రాష్ట్రాలను కరోనా స్ట్రెయిన్ వణికిస్తోంది. బ్రిటన్‌లో వెలుగుచూసిన ఈ వైరస్ ఇపుడు ఆంధ్రప్రదేశ్, తెలంగాణా రాష్ట్రాల్లోకి ప్రవేశించింది. ఈ నెల 10న యూకే నుంచి రాష్ట్రానికి చేరుకున్న వరంగల్‌కు చెందిన 49 ఏళ్ల వ్యక్తిలో ఈ వైరస్‌ను గుర్తించారు. అతనికి కరోనా స్ట్రెయిన్ ఉన్నట్టు సీసీఎంబీ నిర్ధారించినా, ఆరోగ్య శాఖ నుంచి మాత్రం అధికారికంగా ఎటువంటి ప్రకటన విడుదల కాలేదు.
 
ఈ నెల 16న బ్రిటన్ నుంచి వచ్చిన ఆ వ్యక్తిలో కరోనా లక్షణాలు వెలుగుచూశాయి. దీంతో స్థానికంగా పరీక్షలు చేయించారు. ఈ నెల 22న ఫలితాలు రాగా వైరస్ సోకినట్టు నిర్ధారణ అయింది. వెంటనే అక్కడే ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేరి చికిత్స పొందుతున్నారు.
 
అయితే, ఆయన బ్రిటన్ నుంచి రావడంతో రెండు రోజుల క్రితం నమూనాలు సేకరించి హైదరాబాద్‌లోని సీసీఎంబీకి పంపించారు. పరీక్షించిన శాస్త్రవేత్తలు ఆయనకు సోకింది కొత్త స్ట్రెయినేనని నిర్ధారించారు. ఈ సమాచారాన్ని ఆదివారమే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు అందించారు.
 
ఆ తర్వాత బాధితుడి కుటుంబ సభ్యులు, సన్నిహితులకు వెంటనే పరీక్షలు నిర్వహించారు. ఆయన భార్యకు నెగటివ్‌ రాగా, 71 ఏళ్ల ఆయన తల్లికి మాత్రం వైరస్ సోకినట్టు నిర్ధారణ అయింది. దీంతో ఆమెను కూడా ఆసుపత్రిలో చేర్చి నమూనాలు సేకరించి సీసీఎంబీకి పంపించారు. తల్లి, కుమారుడి ఆరోగ్యం నిలకడగానే ఉందని వైద్యులు తెలిపారు.
 
మరోవైపు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా ఈ వైరస్ కలకలం సృష్టిస్తోంది. యూకే నుంచి ఢిల్లీకి అక్కడ నుంచి నెల్లూరుకు వచ్చిన ఓ వ్యక్తిలో ఈ వైరస్ లక్షణాలను గుర్తించారు. దీంతో ఆయన ప్రస్తుతం వైద్యుల పర్యవేక్షణలో ఉన్నాడు. అలాగే, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో కూడా ఈ వైరస్ లక్షణాలు ఉన్న మరికొందరిని గుర్తించినట్టు వార్తలు వస్తున్నాయి. 
 
మరోవైపు, తమ రాష్ట్రంలో కొత్త కరోనా స్ట్రెయిన్ ఆనవాళ్లు బయట పడలేదని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ కమిషనర్ కాటమనేని భాస్కర్ తెలిపారు. ఈ స్ట్రెయిన్ వెలుగులోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకు 1,363 మంది యూకే నుంచి రాష్ట్రానికి వచ్చారని చెప్పారు. వీరిలో 1,346 మందిని క్వారంటైన్‌కు పంపామని... మరో 17 మంది ఆచూకీ తెలియాల్సి ఉందన్నారు. 
 
యూకే నుంచి వచ్చిన వారిలో 11 మందికి కరోనా నిర్ధారణ అయిందని... వారికి కాంటాక్టులోకి వచ్చిన వారిలో 12 మందికి పాజిటివ్ అని నిర్ధారణ అయిందని తెలిపారు. వీరి శాంపిల్స్‌ని పూణె వైరాలజీ ల్యాబ్‌కు, హైదరాబాదులోని సీసీఎంబీకి పంపించామని... ఇంకా రిపోర్టులు రావాల్సి ఉందని చెప్పారు.