మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By ఐవీఆర్
Last Modified: శనివారం, 11 ఏప్రియల్ 2020 (21:44 IST)

మానవత్వాన్ని చాటుకున్న తెలంగాణ బిడ్డలు, ఒకరు రూ. 10 లక్షలు, ఇంకొకరు రూ. 3 లక్షల అద్దె మాఫీ

కష్టకాలంలో వున్నవారిని ఆదుకునేవారే ప్రత్యక్ష దేవుళ్లంటారు. కరోనా మహమ్మారి కారణంగా రెక్కాడితే కానీ డొక్కాడని కార్మికులు విలవిలలాడిపోతున్నారు. అదేవిధంగా రోజూవారీ కూలీల పరిస్థితి కూడా దారుణంగా మారింది. ఇలా దేశంలో ఒక్కొక్కరిది ఒక్కో వ్యధలా వుంది. ఈ నేపధ్యంలో తెలంగాణ బిడ్డ ఒకరు తనలోని మానవత్వాన్ని చాటుకున్నారు. 
 
వివరాల్లోకి వెళితే... తెలంగాణలోని సిరిసిల్లా జిల్లాలోని గంభీరావు పేటకు చెందిన కొడూరి బాలలింగం లాక్ డౌన్ కారణంగా ఉపాధి కోల్పోయిన 50 కుటుంబాలను ఆదుకున్నారు. సుమారు రూ. 3 లక్షల అద్దెను మాఫీ చేసి తన పెద్ద మనసును చాటుకున్నారు. 
 
బాలలింగంకు సికింద్రాబాదులోని బోయిన్ పల్లిలో షాపింగ్ కాంప్లెక్స్, నివాస ముదాయం వున్నాయి. ఈ నివాస సముదాయంలో 50 కుటుంబాలు అద్దెకు వుంటున్నాయి. లాక్ డౌన్ కారణంగా వారి వ్యాపారాలు సరిగా సాగకపోవడంతో వారు చెల్లించాల్సిన అద్దెను మాఫీ చేశారు బాలలింగం. 
 
అంతేకాదు తన స్వగ్రామనైన గంభీరావుపేట మండలంలోని ఆయా గ్రామాల్లోని దాదాపు 200 మంది వలస కార్మికులకు ఒక్కొక్కరికి వెయ్యి రూపాయల చొప్పున రూ. 2 లక్షలు విలు చేసే నిత్యావసరాలను సరఫరా చేశారు. అలాగే మెదక్ జిల్లాకు చెందిన రాఘవేంద్ర రావు కూడా రూ. 10 లక్షల అద్దెను మాఫీ చేసి తన పెద్ద మనసును చాటుకున్నారు.  వీరిరువురికీ మంత్రి కేటీఆర్ కృతజ్ఞతలు తెలియజేశారు.