మంగళవారం, 18 ఫిబ్రవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 24 సెప్టెంబరు 2020 (10:40 IST)

తమిళ సినీ నటుడు విజయకాంత్‌కు కరోనా పాజిటివ్

తమిళ సినీ నటుడు విజయకాంత్‌కు కరోనా వైరస్ సోకింది. గత కొంతకాలంగా ఆయన జ్వరం, వళ్లు నొప్పులు, దగ్గు, జలుబుతో బాధపడుతూ వచ్చారు. దీంతో ఆయనకు కరోనా పరీక్షలు నిర్వహించగా, ఇందులో వైరస్ సోకినట్టు నిర్ధారణ అయింది. దీంతో ఆయన్ను చెన్నైలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. 
 
కాగా ప్రముఖ తమిళ సినీ నటుడు, ఎన్నో విజయవంతమైన చిత్రాల్లో నటించి, తన అభిమానులను మెప్పించిన విజయకాంత్.. రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. ప్రస్తుతం ఆయన డీఎండీకే పార్టీ అధ్యక్షుడిగా కూడా ఉన్నారు. పైగా, తమిళనాట చిన్న ఎంజీఆర్‌గా గుర్తింపు పొందారు. కష్టాల్లో ఉన్నవారిని ఆదుకోవడంలో స్వర్గీయ ఎంజీఆర్ తరహాలోనే విజయకాంత్ కూడా సహాయం చేసేవారు. అందుకే ఈయనకు చిన్న ఎంజీఆర్ అనే పేరు వచ్చింది. 
 
ఇదిలావుంటే, తమ అభిమాన హీరోకు కరోనా సోకడంతో అభిమానుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. విజయకాంత్ ఇటీవల పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనగా, ఆ సమయంలోనే వైరస్ ఎవరి నుంచో అంటుకున్నట్టు తెలుస్తోంది. విజయకాంత్ త్వరగా కోలుకోవాలని తమిళనాడు వ్యాప్తంగా ఆయన అభిమానులు ప్రత్యేక పూజలు ప్రారంభించారు. మరోవైపు, విజయకాంత్ ఆరోగ్యం నిలకడగా ఉన్నట్టు ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి.