మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 22 సెప్టెంబరు 2020 (10:15 IST)

తెలంగాణలో మళ్లీ పంజా విసిరిన కరోనా.. 2వేల మార్కును..?

తెలంగాణలో కరోనా వైరస్ విజృంభిస్తోంది. తగ్గినట్లే తగ్గి మళ్లీ పెరుగుతున్న కేసులతో షాక్ తప్పట్లేదు. రాష్ట్రంలో సోమవారం తగ్గిన కరోనా కేసులు మళ్లీ రెండువేల మార్కును దాటాయి. గత 24 గంటల్లో సోమవారం తెలంగాణలో కొత్తగా 2,166 కరోనా కేసులు నమోదైనాయి. ఇంకా కరోనా కారణంగా పది మంది ప్రాణాలు కోల్పోయారు. 
 
తాజాగా నమోదైన కేసులతో.. తెలంగాణలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,74,774 కి చేరగా.. మరణాల సంఖ్య 1,052 కి పెరిగింది. ఈ మేరకు తెలంగాణ వైద్యఆరోగ్యశాఖ మంగళవారం ఉదయం హెల్త్ బులెటిన్‌ను విడుదల చేసింది. అయితే.. సోమవారం ఒక్కరోజే వైరస్‌ నుంచి 2,143 మంది కోలుకున్నారు. దీంతో ఇప్పటివరకు ఈ మహమ్మారి నుంచి 1,44,073 మంది బాధితులు కోలుకోగా.. ప్రస్తుతం తెలంగాణలో 29,649 మంది చికిత్స పొందుతున్నారు.
 
ఇదిలాఉంటే.. తెలంగాణ వ్యాప్తంగా సోమవారం 53,690 కరోనా టెస్టులు చేసినట్లు వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. దీంతో ఇప్పటివరకు రాష్ట్రంలో 25,73,005 నమూనాలను పరీక్షించినట్లు తెలిపింది. ప్రస్తుతం తెలంగాణలో కరోనా రికవరీ రేటు 82.43 శాతం ఉండగా.. మరణాల రేటు 0.60 శాతంగా ఉంది. అయితే సోమవారం నమోదైన కేసుల్లో అత్యధికంగా జీహెచ్‌ఎంసీలో 309 కేసులు నమోదయ్యాయి.