మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 21 సెప్టెంబరు 2020 (16:42 IST)

ఆ స్కూల్ లైసెన్స్ రద్దయ్యేంత వరకు పోరాటం : శివబాలాజీ

తెలుగు రాష్ట్రాల్లో ప్రైవేట్ స్కూళ్ళ ఫీజుల దోపిడీపై సినీ నటుడు శివబాలాజీ పోరాటం చేస్తున్నారు. ఇందులోభాగంగా, హైదరాబాద్ మణికొండలో ఉన్న మౌంట్ లిటేరా జీ స్కూల్లో చదువుతున్న తన పిల్లలను ఎలాంటి కారణం లేకుండానే ఆన్‌లైన్ క్లాసుల నుంచి తొలగించారంటూ ఆరోపించారు. ఆ తర్వాత ఆయన నేరుగా తెలంగాణ రాష్ట్ర మానవహక్కుల సంఘానికి ఫిర్యాదు చేశారు. 
 
ఆన్‌లైన్ క్లాసుల పేరుతో అధిక ఫీజులు వసూలు చేస్తున్నారంటూ తాను చేసిన ఫిర్యాదుపై దర్యాప్తు ఎంత వరకు వచ్చిందో తెలుసుకునేందుకు సోమవారం డీఈవోను ఆయన కలిశారు. ఆయనతో పాటు ఆయన భార్య మధుమిత కూడా వచ్చారు.
 
ఆ తర్వాత ఆయన మీడియాతో మాట్లాడుతూ, తన ఫిర్యాదుపై హెచ్చార్సీ చాలా వేగంగా స్పందించిందన్నారు. స్కూల్ నుంచి స్పందన వచ్చిందని, తమ పిల్లల ఆన్‌లైన్ క్లాసులకు యాక్సెస్ ఇచ్చారని చెప్పారు. అయితే తమ పిల్లలను ఎందుకు తొలగించారో స్కూల్ యాజమాన్యం చెప్పాలని డిమాండ్ చేశారు. 
 
టెక్నికల్ సమస్య వల్ల అలా జరిగిందని స్కూల్ వాళ్లు చెపుతున్నారని అన్నారు. కానీ, కావాలనే ఇలా చేశారని, దానికి సంబంధించిన ఆధారాలను డీఈవోకి ఇచ్చామన్నారు. విద్యార్థుల తల్లిదండ్రులకు న్యాయం జరగకపోతే స్కూల్ లైసెన్స్ రద్దయ్యేంత వరకు పోరాడుతామని చెప్పారు. డీఈవోకు అన్ని విషయాలను వివరించామని తెలిపారు.