శనివారం, 11 జనవరి 2025
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. మహామహులు
Written By pnr
Last Updated : ఆదివారం, 31 జనవరి 2016 (19:00 IST)

దెబ్బకు దెబ్బ.. ఆసీస్‌ను చిత్తు చేసిన భారత్.. ట్వంటీ-20 సిరీస్ కైవసం

దెబ్బకు దెబ్బ కొట్టడమంటే ఇదే. ఆస్ట్రేలియా గడ్డపై కంగారులను ధోనీ సేన ముచ్చెమటలు పోయించింది. మూడు మ్యాచ్‌ల ట్వంటీ-20 సిరీస్‌ను 3-0 తేడాతో కైవసం చేసుకుంది. ఆదివారం సిడ్నీ వేదికగా జరిగిన మూడో మ్యాచ్‌లో భారత్.. ఏడు వికెట్ల తేడాతో విజయభేరీ మోగించింది. ఈ మ్యాచ్ చివర వరకూ ఉత్కంఠభరితంగా సాగింది. 
 
ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆసీస్ నిర్ణీత ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 197 పరుగులు చేసింది. ఓపెనర్ ఉస్మాన్ ఖాజా (14), షాన్ మార్ష్ (9), మాక్స్ వెల్ (3) వరుసగా ఔటయ్యారు. అయినప్పటికీ, వాట్సన్ తన జోరు కొనసాగించాడు. భారత బౌలర్లపై విరుచుకుపడ్డ వాట్సన్ 86 బంతుల్లో 10 ఫోర్లు, 6 సిక్సర్లతో మొత్తం 124 పరుగులు చేశాడు. తన కెరీర్‌లో తొలి టీ 20 సెంచరీ సాధించాడు. దీంతోపాటు టీ20లో ఆస్ట్రేలియా తరపున రెండో శతకాన్ని సాధించిన ఆటగాడిగా వాట్సన్ గుర్తింపు పొందాడు.
 
ఆ తర్వాత 198 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన భారత్.. చివరి బంతిని సిక్సర్‌గా మార్చి విజయాన్ని అందుకున్నారు. ఈ మ్యాచ్‌లో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ అర్థ సెంచరీలతో రాణించగా, చావోరేవో అనేలా సాగిన చివరి ఓవర్లో సిక్స్, ఫోర్‌తో యువరాజ్ సింగ్ టీమిండియాను విజయం ముంగిట నిలబెట్టాడు. రైనా 25 బంతుల్లో 49 పరుగులు చేసి, చివరి బంతికి ఫోర్ చేసి విన్నింగ్ షాట్ చేశాడు. ఈ విజయంతో టీమిండియా ఆస్ట్రేలియాతో జరిగిన టి-20 సిరీస్‌ను క్లీన్ స్వీప్ చేసింది. వన్డే సిరీస్‌ను కోల్పోయిన టీమిండియా టి-20 సిరీస్‌ను గెలిచి సత్తా చాటింది.