ఆదివారం, 12 జనవరి 2025
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 11 జనవరి 2021 (12:15 IST)

క్రికెట్‌కు జాతి - రంగు - మతాలతో సంబంధం లేదు : సచిన్

భారత్ - ఆస్ట్రేలియా జట్ల మధ్య మూడో టెస్ట్ మ్యాచ్ సిడ్నీలో జరుగుతోంది. ఈ టెస్టు మ్యాచ్‌ను చూడ‌డానికి వ‌చ్చిన కొంద‌రు ప్రేక్ష‌కులు భార‌త‌ క్రికెటర్లు మహ్మద్ సిరాజ్, జస్ప్రీత్ బుమ్రాలపై‌ జాత్యహంకార వ్యాఖ్య‌లు చేశారు. ఆదివారం కూడా ఇది పునరావృతమైంది. బౌలర్లు మహ్మద్ సిరాజ్, జస్ప్రీత్ బుమ్రా బౌండరీ వద్ద ఫీల్డింగ్ చేస్తుండగా జాత్యహంకార వినిపించారు. మళ్లీ ఇవాళ కూడా సిరాజ్‌ను లక్ష్యంగా చేసుకుని కొందరు ప్రేక్షకులు జాతి వివక్షపూరిత వ్యాఖ్యలు చేయడం అగ్నికి ఆజ్యం పోసినట్టయింది. దీనిపై టీమిండియా రెగ్యులర్ కెప్టెన్ విరాట్ కోహ్లీ తీవ్రంగా స్పందించాడు.
 
దీనిపై టీమిండియా మాజీ క్రికెట‌ర్ స‌చిన్ టెండూల్క‌ర్ స్పందించారు. ఆటలు అందరినీ కలుపుతాయని, అంతేగానీ మనుషులను విడదీయబోవని తెలిపారు. క్రికెట్ ఎన్న‌డూ వివక్ష చూపబోదని, ఆటగాళ్ల ప్రతిభ మాత్రమే చూస్తుందని అన్నారు. ఆట‌లో ఆటగాళ్ల జాతి, రంగు, మతాల‌తో సంబంధం లేదని, దీన్ని అర్థం చేసుకోని వారికి క్రీడా రంగంలో కొనసాగే అర్హత లేదని తెలిపారు. 
 
అలాగే, భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ కూడా స్పందించారు. జాతివివక్ష దూషణలు ఏ విధంగానూ ఆమోదయోగ్యం కాదని స్పష్టంచేశాడు. గతంలోనూ బౌండరీ లైన్ల వద్ద ఇలాంటివి ఎన్నో నీచమైన ఉదంతాలు జరిగాయని ఇప్పుడు జరిగిన ఘటనలు రౌడీ తరహా ప్రవర్తనకు పరాకాష్ఠ అని ఆగ్రహం వ్యక్తంచేశాడు. 
 
ఫీల్డింగ్ చేస్తుండగా జాత్యహంకార వ్యాఖ్యలు ఎదుర్కోవాల్సి రావడం బాధాకరం అని కోహ్లీ పేర్కొన్నాడు. ఇలాంటి ఘటనలను ఎంతో తీవ్రమైనవిగా పరిగణించి, అత్యవసర ప్రాతిపదికన విచారణ జరపాలని డిమాండ్ చేశాడు. మరోసారి ఎవరూ ఇలాంటి వ్యాఖ్యలు చేయకుండా కఠినశిక్షలు విధించాలని తెలిపాడు.
 
కాగా, సిడ్నీ టెస్టులో జాతి వివక్ష కలకలం రేగడం పట్ల ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు (సీఏ) క్షమాపణలు కోరింది. తమ స్నేహితులైన భారత ఆటగాళ్లు తమను మన్నించాలని, ప్రేక్షకుల్లో కొందరి ప్రవర్తన పట్ల తాము చింతిస్తున్నామని ఓ ప్రకటన విడుదల చేసింది.
 
అటు అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) కూడా దీనిపై దృష్టి సారించింది. సిడ్నీలో వర్ణ వివక్ష పూరిత వ్యాఖ్యలు చోటుచేసుకోవడాన్ని ఐసీసీ ఖండించింది. వ్యాఖ్యలు చేసినవారిపై ఎలాంటి చర్యలు తీసుకున్నారో తమకు నివేదించాలంటూ ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డుకు స్పష్టం చేసింది.