శనివారం, 9 నవంబరు 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By వరుణ్
Last Updated : గురువారం, 18 జులై 2024 (13:27 IST)

టీమిండియా కోచ్‌కు గంభీర్‌కు షాకిచ్చిన బీసీసీఐ

gautam gambhir
భారత క్రికెట్ జట్టు గౌతం గంభీర్‌కు భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) తేరుకోలేని షాకిచ్చింది. ఆయన భారత క్రికెట్ కోచ్‌గా బాధ్యతలు చేపట్టినప్పటికీ సహాయక సిబ్బందిపై క్లారిటీ రాలేదు. బీసీసీఐ పెద్దలతో పాటు గంభీర్ కూడా కోచింగ్ సిబ్బందిని అన్వేషించే పనిలో ఉన్నారు. ఈ క్రమంలో కోచింగ్ సిబ్బందిలో వివిధ పాత్రల కోసం గంభీర్ సూచించిన ఐదుగురు మాజీలలో నలుగురిని బీసీసీఐ తిరస్కరించినట్టు కథనాలు వెలువడుతున్నాయి. ఆర్.వినయ్ కుమార్, మోర్నీ మోర్కెల్, అభిషేక్ నాయర్, ర్యాన్ టెన్ డోస్చాట్, జాంటీ రోడ్స్, లక్ష్మీపతి బాలాజీ పేర్లను గంభీర్ సూచించగా ప్రస్తుతం కోల్‌కతా నైట్ రైడర్స్‌కు అసిస్టెంట్ కోచ్‌గా పనిచేస్తున్న అభిషేక్ నాయర్‌కు మాత్రమే బీసీసీఐ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తోంది.
 
అధికారిక ప్రకటన వెలువడకపోయినప్పటికీ అభిషేక్ నాయర్ పట్ల బీసీసీఐ సుముఖంగా ఉన్నట్టు జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి. అయితే మోర్నీ మోర్కెల్, వినయ్ కుమార్, బాలాజీ, జాంటీ రోడ్స్, ర్యాన్ టెన్ పట్ల బోర్డు ఆసక్తి చూపలేదని తెలిపింది. మాజీ కోచ్‌లు రవిశాస్త్రి, రాహుల్ ద్రావిడ్‌లకు తమ కోచింగ్ స్టాఫ్‌ను ఎంపిక చేసుకునే స్వేచ్ఛను బీసీసీఐ కల్పించిందని, అయితే గంభీర్ విషయంలో ఆ స్వేచ్ఛ ఇవ్వడం లేదని పేర్కొంది.
 
భారత జట్టు తదుపరి బౌలింగ్ కోచ్‌కు జహీర్ ఖాన్‌ను నియమించాలని బీసీసీఐ భావిస్తున్నట్లు కథనాలు వెలువడుతున్నాయి. భారత్‌కు ఆడిన అత్యుత్తమ బౌలర్లలో జహీర్ ఖాన్ ఒకడని, అతడికి అవకాశం ఇవ్వాలని బీసీసీఐ పెద్దలు భావిస్తున్నట్టు తెలుస్తోంది. కాగా జహీర్ భారత్ జట్టుకు అన్ని ఫార్మాట్లలో కలిపి 309 అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడి మొత్తం 610 వికెట్లు తీశాడు. లక్ష్మీపతి బాలాజీ పేరు కూడా బీసీసీఐ దృష్టికి వచ్చినప్పటికీ జహీర్ ఖాన్‌ వైపే మొగ్గుచూపుతోందని సమాచారం.