గురువారం, 7 నవంబరు 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By వరుణ్
Last Updated : బుధవారం, 10 జులై 2024 (10:43 IST)

ద్రావిడ్ గొప్ప మనస్సు... రూ.5 కోట్లు వద్దు... సమానంగా ఇవ్వండి!!

rahul dravdi
భారత క్రికెట్ దిగ్గజం, భారత క్రికెట్ జట్టు ప్రధాన మాజీ కోచ్ రాహుల్ ద్రావిడ్ మరోమారు తన గొప్ప మనసును చూపించారు. తనతో పాటు పని చేసిన సహాయక సిబ్బందితో సమానంగానే తనను కూడా చూడాలని భారత క్రికెట్ కంట్రోల్ బోర్డుకు విజ్ఞప్తి చేశారు. అందువల్ల తనకు రూ.5 కోట్ల నగదు బహుమతి వద్దని సహాయక కోచ్‌లకు ఇచ్చినట్టుగానే రూ.2.50 కోట్లు ఇవ్వాలని విజ్ఞప్తి చేయగా, దానికి బీసీసీఐ కూడా సమ్మతం తెలిపింది. 
 
భారత క్రికెట్ జట్టు దాదాపు 11 ఏళ్ల తర్వాత టీమిండియా ఐసీసీ ట్రోఫీని సాధించడంలో ద్రావిడ్ కీలక పాత్ర పోషించాడు. రోహిత్ శర్మ నాయకత్వంలో భారత్ టీ20 ప్రపంచ కప్‌ను నెగ్గిన సంగతి తెలిసిందే. కోచ్‌గా వ్యవహరించిన ద్రావిడ్ తన పదవీ కాలాన్ని ఘనంగా ముగించాడు. దీంతో బీసీసీఐ రూ.125 కోట్ల నజరానా ప్రకటించి.. బృందంలోని 15 మంది ప్లేయర్లకు రూ.5 కోట్లు చొప్పున.. రిజర్వ్ ఆటగాళ్లకు రూ.కోటి చొప్పున అందించింది.
 
ప్రధాన కోచ్‌గా బాధ్యతలు నిర్వర్తించిన రాహుల్ ద్రావిడ్‌కు రూ.5 కోట్ల బోనస్ దక్కింది. అయితే బ్యాటింగ్ కోచ్ విక్రమ్ రాథోడ్, ఫీల్డింగ్ కోచ్ దిలీప్, బౌలింగ్ కోచ్ పరాస్ మాంబ్రే ఒక్కొక్కరికి రూ.2.5 కోట్లను ఇచ్చింది. దీంతో రాహుల్ కూడా తన బోనస్‌ను సగానికి తగ్గించుకోవాలని భావిస్తున్నాడని సమాచారం. అందరికీ సమానంగా బోనస్ అందించాలని కోరినట్లు వార్తలు వచ్చాయి.
 
'ద్రావిడ్ కూడా తన సహాయ కోచింగ్ స్టాఫ్లో సమానంగానే బోనస్‌ను పంచుకోవాలనుకుంటున్నాడు. ద్రావిడ్‌కు బోనస్‌గా రూ.5 కోట్లు వచ్చాయి. కానీ, ఇతర కోచ్‌లకు రూ.2.5 కోట్లను బీసీసీఐ అందించింది. దీంతో తనను ప్రత్యేకంగా చూడటంపై ద్రావిడ్ ఇబ్బంది పడినట్లు ఉన్నాడు. వారందరితోపాటు తనకూ బోనస్‌ను రూ.2.5 కోట్లు ఇవ్వాలని కోరాడు. అతడి సెంటిమెంట్‌ను మేం అర్థం చేసుకొని గౌరవిస్తాం" అని బీసీసీఐ అధికార వర్గాలు వెల్లడించాయి.
 
కాగా, 2018లో అండర్-19 ప్రపంచ కప్ సాధించిన భారత జట్టును ద్రావిడే నడిపించాడు. అతడి కోచింగ్‌లోనే టీమ్ండియా అద్భుతాలు సృష్టించింది. దీంతో ఆటగాళ్లకు, కోచింగ్ స్టాప్‌కు బీసీసీఐ నజరానా ప్రకటించింది. ద్రావిడ్‌కు అత్యధికంగా రూ.50 లక్షలు ఇవ్వగా.. సహాయక సిబ్బందికి రూ.20 లక్షలు, ఒక్కో ఆటగాడికి రూ.30 లక్షలు చొప్పున అందించింది. కానీ, ద్రావిడ్ మాత్రం అందరితోపాటు తనకూ సమానంగా ఇవ్వాలని బీసీసీఐకి విజ్ఞప్తి చేశాడు. దీంతో క్యాష్ అవార్డులను బోర్డు రివైజ్ చేసి సిబ్బందికి రూ.25 లక్షల చొప్పున అందించింది. ఇప్పుడు మరోసారి అలాంటి నిర్ణయమే తీసుకోవడంతో నెట్టింట అభిమానులు ప్రశంసలు కురిపిస్తున్నారు.