పీసీబీకి షాకిచ్చిన బీసీసీఐ : పాకిస్థాన్ గడ్డపై అడుగుపెట్టమని తేల్చి చెప్పిన వైనం!!
వచ్చే యేడాది పాకిస్థాన్ గడ్డపై ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ 2025 పోటీలు జరుగనున్నాయి. ఈ పోటీల్లో పాల్గొనేందుకు భారత క్రికెట్ జట్టు పాకిస్థాన్ గడ్డపై అడుగుపెట్టాల్సివుంది. అయితే, ఈ టోర్నీ కోసం పాకిస్థాన్‌కు వెళ్లే ప్రసక్తే లేదని భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు తేల్చి చెప్పేసింది. తాము ఆడే అన్ని మ్యాచ్‌లను తటస్థ వేదికలపై నిర్వహించాలని కోరింది. ఈ టోర్నీ వచ్చే యేడాది ఫిబ్రవరి, మార్చి నెలల మధ్య జరుగనుంది.
గత కొంతకాలంగా భారత్, పాకిస్థాన్ దేశాల మధ్య దౌత్య సంబంధాలు దెబ్బతిన్నాయి. ఈ కారణంగా 2008లో జరిగిన ఆసియా కప్ తర్వాత పాకిస్థాన్‌లో భారత జట్టు పర్యటించలేదు. అలాగే భారతదేశంలో 2012 డిసెంబర్ నుంచి 2013 జనవరి మధ్య జరిగిన భారత్-పాక్ ద్వైపాక్షిక సిరీసే చివరిది. నాటి నుంచి ఇరు దేశాలు కేవలం ఐసీసీ టోర్నమెంట్లు, ఆసియా కప్‌లో మాత్రమే తలపడుతున్నాయి.
భారత్ - పాక్ మధ్య ఇంకా సంబంధాలు పునరుద్ధరణ కాకపోవడంతో చాంపియన్స్ ట్రోఫీలో టీమిండియా పాల్గొనడంపై అనిశ్చితి కొనసాగుతోంది. ఒకే నగరంలో అన్ని మ్యాచ్‌లను ఆదాలని భారత్‌కు పాక్ క్రికెట్ బోర్డు ప్రతిపాదించింది. భారత్ అన్ని మ్యాచ్‌లు ఆడేందుకు లాహోర్‌ను వేదికగా ఎంపిక చేసినట్లు ఈఎస్ పీఎన్ క్రిక్ ఇన్ఫో వెబ్ సైట్ తెలిపింది. అయితే పాక్‌లో పర్యటించేందుకు భారత జట్టు సుముఖంగా లేదు. ఇదే విషయాన్ని బీసీసీఐ వర్గాలు ఏఎస్ఐ వార్తాసంస్థకు తెలిపాయి.
కేంద్ర ప్రభుత్వం అనుమతిస్తేనే ఈ టోర్నమెంట్ కోసం టీమిండియాను పాకిస్థాన్‌కు పంపుతామని బీసీసీఐ ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా మే నెలలో చెప్పారు. 'చాంపియన్స్ ట్రోఫీ విషయంలో కేంద్ర ప్రభుత్వం ఏం చెబితే అది చేస్తాం. ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వ నిర్ణయానికి అనుగుణంగా నడుచుకుంటాం' అని ఆయన ఏఎస్ఐ వార్తాసంస్థతో మాట్లాడుతూ అన్నారు.
గతేడాది ఆసియా కప్‌లోనూ ఇలాంటి పరిస్థితే ఎదురైంది. వాస్తవానికి ఈ టోర్నీకి పాకిస్థాన్ క్రికెట్ బోర్డు ఆతిథ్యం ఇవ్వాల్సి ఉంది. కానీ బీసీసీఐ ఒత్తిడి కారణంగా పాక్ హైబ్రీడ్ విధానాన్ని అనుసరించింది. భారత్ - పాక్ మ్యాచ్‌లను తటస్థ వేదిక అయిన శ్రీలంకలో నిర్వహించింది. 2017లో చివరిసారిగా జరిగిన చాంపియన్స్ ట్రోఫీని పాకిస్థాన్ గెలుచుకుంది.