మంగళవారం, 7 జనవరి 2025
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By వరుణ్
Last Updated : ఆదివారం, 14 జులై 2024 (18:40 IST)

ప్లీజ్.. అన్షుమన్ గ్వైకాడ్‌ను ఆదుకోండి.. నా పెన్షన్ డబ్బులు ఇస్తున్నా... కపిల్ దేవ్

kapil dev
భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ)కు దేశానికి 1983లో తొలిసారి క్రికెట్ ప్రపంచ కప్‌ను అందించిన టీమిండియా మాజీ దిగ్గజం, నాటి టీమిండియా సారథి కపిల్ దేవ్ ఓ విజ్ఞప్తి చేశాడు. రక్త కేన్సర్‌తో బాధపడుతున్న నాటి వరల్డ్ కప్ జట్టులోని తన మాజీ సహచరుడు, 71 ఏళ్ల అన్షుమన్ గైక్వాడ్‌ను ఆదుకోవాలని కోరాడు. గత యేడాది కాలంగా గైక్వాడ్ లండన్‌లోని కింగ్స్ కాలేజీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. గైక్వాడ్ వైద్య ఖర్చుల కోసం నిధులు సేకరించేందుకు అప్పటి జట్టు సభ్యులైన మోహిందర్ అమర్ నాథ్, సునీల్ గవాస్కర్, సందీప్ పాటిల్, దిలీప్ వెంగ్ సర్కార్, మదన్ లాల్, రవి శాస్త్రి, కీర్తి ఆజాద్ శాయశక్తులా కృషి చేస్తున్నారని కపిల్ వెల్లడించాడు.
 
'ఇది ఎంతో విచారకరం, కుంగుబాటుకు గురిచేసే విషయం. నేను ఎంతో బాధలో ఉన్నా. ఎందుకంటే.. అతనితో కలిసి నేను క్రికెట్ ఆదా. అతన్ని అలాంటి పరిస్థితుల్లో చూడలేకపోతున్నా. ఎవరూ అలా బాధపడకూడదు. బోర్డు అతన్ని సంరక్షిందని తెలుసు. మేం ఎవరినీ ఒత్తిడి చేయడం లేదు. ఏ సాయం అయినా మీ మనస్ఫూర్తిగా రావాలి. ఆ కాలంలో అరవీర భయంకరులైన బౌలర్లను ఎదుర్కొనే క్రమంలో అతను ముఖం, ఛాతీపై ఎన్నో దెబ్బలు తిన్నాడు. ఇప్పుడు అతని కోసం మనం నిలబడాల్సిన సమయం వచ్చింది. మన క్రికెట్ అభిమానులు అతన్ని ఓడించరని ఖచ్చితంగా నమ్ముతున్నా. అతను కోలుకొనేందుకు వారంతా దేవుడిని ప్రార్థించాలి' అని కపిల్ దేవ్ స్పోర్ట్ స్టార్ మ్యాగజైన్ తో మాట్లాడుతూ చెప్పాడు.
 
అయితే అన్షుమన్ లాంటి మాజీ ఆటగాళ్లను ఆదుకొనేందుకు సరైన వ్యవస్థ అందుబాటులో లేకపోవడంపై కపిల్ ఆవేదన వ్యక్తం చేశాడు. ఈ విషయంలో ఒకవేళ పరిస్థితి మెరుగుపడకపోతే తన పెన్షన్‌ను వదులుకొనేందుకు కూడా సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించాడు. 'దురదృష్టవశాత్తూ మనకు ఒక వ్యవస్థ లేదు. కానీ ఈ తరం ఆటగాళ్లు బాగా డబ్బు ఆర్జిస్తుండటం మంచి విషయం. సహాయ సిబ్బందికి కూడా బాగానే డబ్బు చెల్లిస్తున్నారు. కానీ మా కాలంలో బోర్డు వద్ద అంత డబ్బు లేదు. ఇప్పుడు బోర్డు గత ఆటగాళ్లను సంరక్షించే బాధ్యత తీసుకోవాలి. కానీ ఆటగాళ్లు వారి చందాలను ఎక్కడికి పంపించాలి? ఒకవేళ ఒక ట్రస్ట్‌ను ఏర్పాటు చేస్తే అందులోకి డబ్బు పంపించొచ్చు. దీన్ని బీసీసీఐ ఏర్పాటు చేస్తుందనుకుంటున్నా. వాళ్ల కుటుంబం అంగీకరిస్తే మా పెన్షన్ సొమ్మును కూడా విరాళం కింద అందించేందుకు సిద్ధంగా ఉన్నాం' అని కపిల్ దేవ్ చెప్పాడు.