1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By వరుణ్

నాన్నతో కలిసి ఎల్పీజీ గ్యాస్ సిలిండర్లు మోశాను : రింకు సింగ్

rinku singh
మా కుటుంబ పోషణ నిమిత్తం మా నాన్నతో కలిసి ఎల్పీజీ గ్యాస్ సిలిండర్లు మోసుకుని వెళ్లి ఇంటింటికీ వెళ్లి డెలివరీ చేసినట్టు కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టు ఆటగాడు రింకు సింగ్ తెలిపారు. ప్రస్తుతం స్వదేశంలో జరుగుతున్న ఐపీఎల్ 2023లో భాగంగా గుజరాత్ టైటాన్స్ జట్టుతో కేకేఆర్ జట్టు తలపడింది. ఇందులో రింకు సింగ్ సంచలన ఇన్నింగ్స్ ఆడి జట్టుకు విజయాన్ని అందించారు. కేవలం 21 బంతుల్లో 48 పరుగులు చేశాడు. ముఖ్యంగా. చివరి ఐదు బంతుల్లో 29 పరుగులు కావాల్సిన తరుణంలో వరుసగా సిక్సర్లు బాది కేకేఆర్ జట్టుకు చిరస్మరణీయమైన విజయాన్ని అందించాడు. దీంతో ఒక్కసారిగా ఐపీఎల్ హీరో అయిపోయాడు. 
 
ఈ నేపథ్యంలో రింకు సింగ్ తాజాగా ఓ ఇంటర్వ్యూ ఇచ్చాడు. ఇందులో తన కుటుంబ నేపథ్యం గురించి వెల్లడించాడు. నిరుపేద కుటుంబంలో జన్మించిన తాను ఎన్నో కష్టాలు ఎదుర్కొని ఈ స్థాయికి వచ్చానని చెప్పాడు. ఒకప్పుడు తమ కుటుంబంలో అప్పుల బాధతో ఇబ్బందిపడేదని, ప్రస్తుతం ఆ కష్టాలన్నీ తీరాయని రింకు సింగ్ చెప్పాడు. 
 
'నేను నా కుటుంబం కోసం ఏదైనా చేస్తాను. ప్రస్తుతం మా కష్టాలన్నీ తీరిపోయాయి. నాన్న ఎల్పీజీ గ్యాస్‌ సిలిండర్ల పంపిణీ చేసే సంస్థలో పని చేస్తున్నారు. 30 సంవత్సరాలుగా కుటుంబం కోసం కష్టపడుతున్నారు. ఆయనను ఉద్యోగం మానేయని చెప్పాను. అయినా చేస్తానని పట్టుబట్టారు. నేను, నా సోదరులు నాన్నతో కలిసి గ్యాస్ సిలిండర్లు ఇంటింటికి వెళ్లి డెలివరీ చేసేవాళ్లం. మొదట్లో నేను క్రికెట్ ఆడతానంటే నాన్న అంగీకరించలేదు. ఆయనతో కలిసి పని చేసి డబ్బు సంపాదించాలని కోరుకున్నారు. అమ్మ నాకు సపోర్ట్ చేసేది' అని రింకు సింగ్‌ వివరించాడు.
 
గుజరాత్ టైటాన్స్‌‌పై ఆడిన ఇన్నింగ్స్‌ కెరీర్‌లో టర్నింగ్ పాయింట్ అవుతుందా అని అడిగినప్పుడు.. తన జీవితంలో ఇప్పటివరకు ఇదే అత్యుత్తమ ఇన్నింగ్స్ అని సమాధానమిచ్చాడు. భారత జాతీయ జట్టుకు ఆడాలనే కల ఉందా  అని ప్రశ్నించగా.. ప్రస్తుతం తన దృష్టంతా ఈ ఐపీఎల్‌పైనే ఉందంటూ తెలివిగా సమాధానమిచ్చాడు.