సోమవారం, 30 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By వరుణ్
Last Updated : గురువారం, 6 ఏప్రియల్ 2023 (13:11 IST)

లింగంగుంట్లలో ఫ్యామిలీ డాక్టర్ స్కీమ్‌ను ప్రారంభించిన సీఎం జగన్

jagan
ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మరో ప్రజా సంక్షేమ పథకాన్ని ప్రారంభించారు. ప్రతి ఇంటింటికి వెళ్ళి వైద్య సేవలు అందించాలన్న లక్ష్యంతో ఫ్యామిలీ డాక్టర్ కార్యక్రమాన్ని గురువారం ప్రారంభించారు. లింగంగుంట్లో ఈ పథకాన్ని ఆయన చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాష్ట్రంలోని ప్రతి ఒక్కరికీ మెరుగైన వైద్య సేవలు ఇంటి ముంగిటకే అందించాలన్న లక్ష్యంతో ప్రారంభించినట్టు తెలిపారు. వైద్యం అందలేదని ఏ ఒక్క పేద, పామర ప్రజలు ఇబ్బంది పడకూడదని, అందుకే ఈ స్కీమ్‌ను తీసుకొచ్చినట్టు చెప్పారు. ప్రజలందరికీ ఆరోగ్య భరోసా కల్పించేలా తమ ప్రభుత్వం ఫ్యామిలీ డాక్టర్ పథకం ద్వారా భరోసా కల్పిస్తుందన్నారు.
 
ముఖ్యంగా, గ్రామాల్లో అనారోగ్యంతో బాధపడుతున్న వారు వైద్యం కోసం ఎక్కడెక్కడికో పోవాల్సిన అవసరం ఇకపై ఉండదన్నారు. డాక్టరే మీ గ్రామానికి వచ్చి వైద్యం చేస్తాడని వివరించారు. అనారోగ్యంతో మంచానికే పరిమితమైన వారికి ఇంట్లోనే వైద్యం జరుగుతుందని పేర్కొన్నారు. మందులు కూడా గ్రామానికే వస్తాయని తెలిపారు. 
 
ఇంటింటికీ నడిచి వచ్చే పింఛన్ తరహాలోనే వైద్య సేవలు కూడా మీ గ్రామానికి, మీ సమీపానికి.. అవసరమైన సందర్భాలలో మీ ఇంటికే తరలిరావడానికి ఉద్దేశించి తీసుకొచ్చిన ప్రోగ్రాం ఫ్యామిలీ డాక్టర్ అని జగన్ చెప్పారు. నిరుపేదలు, పేద సామాజిక వర్గాల వారు ఆసుపత్రుల చుట్టూ, ల్యాబ్‌ల చుట్టూ, మందుల షాపుల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా ఫ్యామిలీ డాక్టర్ పోగ్రాం మీ గ్రామం వద్దకే వీటన్నిటినీ తీసుకొస్తుందని చెప్పారు.