రూ.27 కోట్ల ధర పలికిన రిషభ్ పంత్.. చేతికొచ్చేది ఎంత?
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) చరిత్రలోనే అత్యధిక ధర పలికిన క్రికెట్ ఆటగాడిగా భారత క్రికెట్ జట్టు వికెట్ కీపర్ రిషభ్ పంత్ సరికొత్త చరిత్ర సృష్టించిన విషయం తెల్సిందే. తాజాగా జరిగిన ఐపీఎల్ వేలం పాటల్లో లక్నో సూపర్ జెయింట్స్ (ఎల్ఎస్ఓ) పంత్‌ను రికార్డు స్థాయిలో రూ.27 కోట్లు వెచ్చించి కొనుగోలు చేసింది. తద్వారా పంత్ అత్యంత ఖరీదైన ఆటగాడిగా రికార్డు సృష్టించాడు.
వేలం సమయంలో ఢిల్లీ క్యాపిటల్స్ రైట్ టు మ్యాచ్ (ఆర్టీఎం)ని ఉపయోగించి పంత్‌ను రూ.20.75 కోట్లకు తిరిగి కొనుగోలు చేసేందుకు యత్నించింది. కానీ, ఎల్ఎస్ఓ బిడ్‌ను అమాంతం రూ.27 కోట్లకు పెంచి పంత్‌ను దక్కించుకుంది. అయితే, రూ.27 కోట్లలో పంత్ చేతికి వచ్చేది ఎంత? అందులో ఎంత పన్ను చెల్లించాల్సి ఉంటుంది? ఒకవేళ అతను టోర్నమెంట్ సమయంలో లేదా అంతకుముందు గాయపడితే ఏం జరుగుతుంది?
భారత ప్రభుత్వం ఆదాయ పన్ను నిబంధనల ప్రకారం పంత్ మొత్తం కాంట్రాక్ట్ విలువ నుంచి రూ.8.1 కోట్లు ట్యాక్స్ రూపంలో చెల్లించాల్సి ఉంటుంది. దాంతో రూ.8.1 కోట్లు పన్నుగా వెళ్లిపోగా పంత్ ప్రతి సీజన్‌కు లక్నో ఫ్రాంచైజీ నుంచి రూ.18.9 కోట్లు జీతంగా పొందుతాడు.
ఒకవేళ టోర్నీకి ముందే గాయపడినా, వ్యక్తిగత కారణాలతో తప్పుకొన్నా ఎలాంటి చెల్లింపు ఉండదు. టోర్నీ మధ్యలో గాయపడి తప్పుకుంటే మాత్రం పూర్తి జీతం చెల్లిస్తారు. టోర్నమెంట్‌కు ముందు గాయమైనా, వ్యక్తిగత కారణాలతో తప్పుకొన్నా ఆ ఆటగాడి స్థానంలో మరో ప్లేయర్‌ను తీసుకునే హక్కు ఫ్రాంచైజీకి ఉంటుంది.
టోర్నీకి ముందు గాయపడితే విదేశీ ఆటగాళ్లకు ఎలాంటి పరిహారం చెల్లించబడదు. టీమిండియాకు ఆడుతూ గాయపడినా భారత ఆటగాళ్లు మాత్రం బీసీసీఐ బీమా పాలసీ ప్రకారం సీజన్ తాలూకు పూర్తి డబ్బును పొందుతారు.