బుధవారం, 25 డిశెంబరు 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 3 నవంబరు 2023 (23:08 IST)

ఐసీసీ వన్డే ప్రపంచ కప్ : మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకున్న ఆప్ఘనిస్థాన్

afghanistan
భారత్‌లో జరుగుతున్న ఐసీసీ  వన్డే ప్రపంచ కప్ పోటీల్లో భాగంగా క్రికెట్ పసికూన ఆప్ఘనిస్థాన్ క్రికెట్ జట్టు మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. శుక్రవారం మరో చిన్నజట్టు నెదర్లాండ్స్ జట్టుతో జరిగిన మ్యాచ్‌లో ఏడు వికెట్ల తేడాతో విజయభేరీ మోగించింది. దీంతో ఆప్ఘాన్ ఇప్పటివరకు ఏడు మ్యాచ్‌లు ఆడి నాలుగు విజయాలో పాయింట్ల పట్టికలో ఐదో స్థానానికి ఎగబాకింది. 
 
లక్నోలో ఏకపక్షంగా సాగిన మ్యాచ్‌లో ఆఫ్ఘన్ జట్టు 7 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది. తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన నెదర్లాండ్స్‌ను 179 పరుగులకే కుప్పకూల్చిన ఆఫ్ఘనిస్థాన్... 180 పరుగుల లక్ష్యాన్ని కేవలం 31.3 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి ఛేదించింది.
 
కెప్టెన్ హష్మతుల్లా షాహిది జట్టును ముందుండి నడిపించాడు. షాహిదీ 56 పరుగులతో అజేయంగా నిలిచాడు. రహ్మత్ షా 52 పరుగులు చేయగా, అజ్మతుల్లా ఒమర్జాయ్ 31 (నాటౌట్) సత్తా చాటాడు. అంతకుముందు, ఓపెనర్లు రహ్మనుల్లా గుర్బాజ్ 10, ఇబ్రహీం జాద్రాన్ 20 పరుగులు చేసి త్వరగా ఔటైనప్పటికీ.. హష్మతుల్లా, అజ్మతుల్లాలు ఇన్నింగ్స్‌కు చక్కదిద్ది... జట్టు విజయానికి బాటలు వేశారు. నెదర్లాండ్స్ బౌలర్లలో లోగాన్ వాన్ బీక్ 1, వాన్ డెర్ మెర్వ్ 1, సకీబ్ జుల్ఫికర్ 1 వికెట్ తీశారు.
 
ఈ గెలుపుతో ఆఫ్ఘనిస్థాన్ సెమీస్ అవకాశాలు మరింత మెరుగయ్యాయి. ఆ జట్టు ఇంకా రెండు మ్యాచ్ లు ఆడాల్సి ఉంది. ఆఫ్ఘన్ జట్టు తన తదుపరి మ్యాచ్‌ను నవంబరు 7న ఆస్ట్రేలియాతో ఆడనుంది. ఆ తర్వాత నవంబరు 10న దక్షిణాఫ్రికాతో ఆడనుంది. అయితే, ఆసీస్, దక్షిణాఫ్రికా జట్లు బలమైనవి కావడంతో, ఆఫ్ఘన్ల పోరాటపటిమకు సిసలైన సవాలు ఎదురుకానుంది. ఇతర జట్ల మ్యాచ్‌ల ఫలితాలు కూడా కలిసొస్తే, ఆఫ్ఘన్‌కు సెమీస్ బెర్తు దక్కినా ఆశ్చర్యపోనక్కర్లేదు.
 
ఈ ప్రపంచ కప్‌లో ఆప్ఘనిస్థాన్ తన ప్రస్థానాన్ని ఓటమితో మొదలుపెట్టింది. తొలుత బంగ్లాదేశ్, ఆ తర్వాత భారత్ చేతిలో ఓడిపోయింది. కానీ, డిఫెండింగ్ చాంపియన్ ఇంగ్లండ్‌పై గెలిచి న్యూజిలాండ్ చేతిలో ఓడింది. ఆ తర్వాత పాకిస్థాన్, శ్రీలంక జట్లను మట్టికరించి సంచలన విజయాలు నమోదు చేసింది. తాజాగా నెదర్లాండ్స్ పై విజయంతో టోర్నీలో నాలుగో విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది.