హరిద్వార్ మానసాదేవి ఆలయంలో తొక్కిసలాట.. భక్తుల మృతి
ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని హరిద్వార్‌లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. మానసాదేవి ఆలయంలో తొక్కిసలాట సంభవించింది. ఇందులో ఆరుగురు భక్తులు ప్రాణాలు కోల్పోయారు. మరికొందరు గాయపడ్డారు. శ్రావణ మాసం సందర్భంగా ఆదివారం ఆలయానికి భక్తులు పోటెత్తారు. భక్తులు ఒక్కసారిగా పెద్ద సంఖ్యలో తరలిరావడంతో క్యూలైన్‌లో తోపులాట చోటుచేసుకుంది. ప్రమాదం గురించి సమాచారం అందడంతో ఎమర్జెన్సీ బృందాలు హాటాహుటిన ఆలయానికి చేరుకున్నాయి. గాయపడిన భక్తులను సమీపంలోని ఆస్పత్రులకు తరలించారు.
ఈ ఘటనలో గాయపడిన భక్తులలో కొందరిపరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. దీంతో మృతుల సంఖ్య మరింతగా పెరిగే అవకాశం ఉందని అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మానసాదేవి ఆలయంలో తొక్కిసలాట జరిగిన ఆరుగురు భక్తులు చనిపోయిన విషయాన్ని గర్వాల్ డివిజనల్ కమిషనర్ వినయ్ శంకర్ పాండ్ ధృవీకరించారు. విషయం తెలిసిన వెంటనే ఆయన ఆలయం వద్దకు బయలుదేరారని, ఘటనా స్థలాన్ని పరిశీలించాక ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడిస్తామని ఆయన తెలిపారు.