గురువారం, 23 జనవరి 2025
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By వరుణ్

ఐసీసీ ప్రపంచ కప్ : ఆప్ఘనిస్థాన్ చేతిలో పాక్ చిత్తు.. రషీద్ ఖాన్ - ఇర్ఫాన్ పఠాన్ డ్యాన్స్

rashid - irfhan dance
స్వదేశంలో జరుగుతున్న ఐసీసీ వన్డే ప్రపంచ కప్ పోటీల్లో భాగంగా, సోమవారం పాకిస్థాన్, ఆప్ఘనిస్తాన్ జట్ల మధ్య కీలకమ్యాచ్ జరిగింది. ఇందులో పటిష్టమైన క్రికెట్ పసికూన ఆప్ఘాన్ చిత్తుగా ఓడిచింది. చెన్నైలోని చెపాక్ స్టేడియం వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో ఆప్ఘాన్ జట్టు 282 పరుగుల టార్గెట్‌ను కేవలం రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి విజయభేరీ మోగించింది. అన్ని రంగాల్లో ఆధిపత్యం ప్రదర్శించి ఆధిపత్యం చెలాయించింది. 
 
ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన పాక్ మొదట 50 ఓవర్లలో 7 వికెట్లకు 282 పరుగులు చేసింది. ఆఫ్ఘాన్ 49 ఓవర్లలో కేవలం 2 వికెట్లు కోల్పోయి విజయలక్ష్యాన్ని అందుకుంది. 283 పరుగుల ఛేజింగ్‌లో ఆఫ్ఘన్ టాపార్డర్ అదరగొట్టింది. ఓపెనర్లు రహ్మానుల్లా గుర్బాజ్, ఇబ్రహీం జాద్రాన్ తొలి వికెట్ కు 130 పరుగులు జోడించి సరైన పునాది వేయగా... రహ్మత్ షా, కెప్టెన్ హష్మతుల్లా షాహిది మిగతా పని పూర్తి చేశారు.
 
రహ్మనుల్లా గుర్బాజ్ 53 బంతుల్లో 9 ఫోర్లు, 1 సిక్స్ తో 65 పరుగులు చేయగా, మరో ఓపెనర్ ఇబ్రహీం జాద్రాన్ 113 బంతుల్లో 87 పరుగులు సాధించాడు. అతడి స్కోరులో 10 ఫోర్లు ఉన్నాయి. వీరిద్దరూ ఔటైన తర్వాత రహ్మత్ షా, హష్మతుల్లా షాహిది మరో వికెట్ పడకుండా జట్టును విజయతీరాలకు చేర్చారు.
 
రహ్మత్ షా 84 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్సర్లతో 77 పరుగులు చేయగా, షాహిది 45 బంతుల్లో 48 పరుగులు చేశాడు. పాక్ బౌలర్లలో షహీన్ అఫ్రిది 1, హసన్ అలీ 1 వికెట్ తీశారు. కాగా, వన్డే క్రికెట్లో పాకిస్థాన్ పై ఆఫ్ఘనిస్థాన్ కు ఇదే మొదటి గెలుపు. అంతేకాదు, వన్డేల్లో ఆఫ్ఘన్లకు ఇదే అత్యధిక లక్ష్యఛేదన. సోమవారం మ్యాచ్ లో 18 ఏళ్ల ఆఫ్ఘన్ కుర్ర స్పిన్నర్ నూర్ మహ్మద్ ప్రదర్శన మ్యాచ్‌కే హైలైట్ అని చెప్పాలి.
 
ఈ విజయాన్ని ఆఫ్ఘనిస్థాన్ అభిమానులనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రికెట్ ఫ్యాన్స్ అందరినీ అలరించింది. అఫ్ఘాన్ ఆటగాళ్లు బౌలింగ్, బ్యాటింగ్ విభాగాల్లో రాణించిన తీరు చూసి మాజీ క్రికెటర్లే ప్రశంసిస్తున్నారు. ఇక స్టార్ స్పోర్ట్స్ వ్యాఖ్యాతగా అదే గ్రౌండ్‌లో ఉన్న భారత మాజీ క్రికెట్ ఇర్ఫాన్ పఠాన్ ఆశ్చర్యపోవడమే కాదు.. అఫ్ఘాన్ విజయాన్ని చిన్నపాటి సెలబ్రేషన్ కూడా చేసుకున్నాడు.
 
గెలుపు అనంతరం అభిమానులకు అభివాదం చేస్తూ గ్రౌండ్‌లో కలియ తిరిగిన అఫ్ఘాన్ ఆటగాళ్లను ఇర్ఫాన్ పఠాన్ అభినందించాడు. రషీద్ ఖాన్‌తో కలిసి మైదానంలోనే డ్యాన్స్ చేశాడు. ఆ వెంటనే రషీదన్‌ను ఆలింగనం చేసుకొని మెచ్చుకున్నాడు. అద్భుతంగా ఆడారంటూ ఆఫ్ఘనిస్తాన్ ఆటగాళ్లతో సంభాషించాడు. పలువురితో కరచాలనం చేశాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియా మాధ్యమాల్లో వైరల్ గా మారింది.