1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By ఐవీఆర్
Last Updated : సోమవారం, 23 అక్టోబరు 2023 (00:44 IST)

కివీస్ పైన టీమిండియా ఘన విజయం: భారత్ విజయానికి, కోహ్లి సెంచరీకి కావలసింది 5 పరుగులే, కానీ...

Rohit-Kohli
ప్రపంచ కప్ 2023 క్రికెట్ పోటీల్లో టీమిండియా జైత్ర యాత్ర సాగుతోంది. న్యూజీలాండ్ జట్టు నడ్డి విరిచి నాలుగు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఐతే మొన్న బంగ్లాదేశ్ జట్టుపై విరాట్ కోహ్లి చేసిన ఫీట్ మరోసారి న్యూజీలాండ్ జట్టుపైన పునరావృతం అవుతుందని అంతా ఉగ్గబట్టుకుని ఎదురుచూసారు. విషయం ఏంటంటే... బంగ్లాదేశ్ జట్టుపై విజయం సాధించడానికి మరో 2 పరుగులు అవసరమైన సమయంలో కోహ్లి సెంచరీ సాధించడానికి 3 పరుగులు కావల్సి వచ్చింది. ఆ సమయంలో కోహ్లి సిక్సర్ కొట్టడంతో అటు జట్టు విజయం ఇటు కోహ్లి సెంచరీ రెండూ ఒకేసారి జరిగాయి. ఇలాగే న్యూజీలాండ్ జట్టుతో తలబడిన కోహ్లికి అదే వరస వచ్చింది.

టీమిండియా విజయానికి 5 పరుగులు కావాలి, కోహ్లి సెంచరీ చేయడానికి కూడా 5 పరుగులు కావాలి. క్రీజులో కోహ్లి వున్నాడు. హెన్రీ వేసిన బంతిని భారీ షాట్ కొట్టాడు. ఐతే బౌండరీ లైన్ వద్ద వున్న ఫిలిప్స్ క్యాచ్ పట్టడంతో కోహ్లి సెంచరీ తృటిలో చేజారిపోయింది. దీనితో టీమిండియా అభిమానులు నిరాశకు గురయ్యారు. ఆ వెంటనే జడేజా ఫోర్ కొట్టడంతో టీమిండియా ఘన విజయం సాధించింది. 
 
274 పరుగుల విజయ లక్ష్యంతో బ్యాటింగ్ కు దిగిన టీమిండియా బ్యాట్సమన్లు రోహిత్ శర్మ-శుభమన్ గిల్ 11.1 ఓవర్లలో 71 పరుగుల భాగస్వామ్యాన్ని అందించారు. రోహిత్ శర్మ ఎప్పటిలాగే దూకుడుగా ఆడాడు. 40 బంతుల్లో 4x4, 4x6లతో 46 పరుగులు చేసాడు. దురదృష్టవశాత్తూ ఫెర్గూసన్ వేసిన బంతి ఇన్ సైడ్ ఎడ్జ్ తగలడంతో అది వికెట్లకు గిరాటేసింది. దీనితో రోహిత్ పెవిలియన్ దారిపట్టాడు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన కోహ్లి.. కివీస్ బౌలర్ల బౌలింగును కొద్దిసేపు ఆకళింపు చేసుకున్నాడు. పరుగులు తీయకుండా ఆచితూచి వ్యవహరించాడు. ఇంతలో 14వ ఓవర్లో గిల్ 26 పరుగుల వద్ద మళ్లీ ఫెర్గూసన్ బౌలింగులో ఔటవ్వడంతో న్యూజీలాండ్ శిబిరంలో గెలుపు ఆశలు చిగురించాయి.
 
ఐతే ఆ తర్వాత వచ్చిన శ్రేయాస్ అయ్యర్, కోహ్లితో జత కలసి కివీస్ బౌలర్లను చిరాకు పెట్టించారు. ఇద్దరూ 50 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పి కుదురుగా వున్నారనుకున్న తరుణంలో అయ్యర్ బౌల్ట్ బౌలింగులో 33 పరుగుల వద్ద డెవన్‌కి దొరికిపోయాడు. ఆ తర్వాత వచ్చిన శ్రేయస్ అయ్యర్ 35 బంతుల్లో 27 పరుగులు చేసాడు. మిట్చెల్ బౌలింగులో అయ్యర్ ఔటవ్వడంతో ప్రపంచ కప్ పోటీల్లో తొలిసారిగా బ్యాటింగ్ చేసేందుకు సూర్యకుమార్ యాదవ్ వచ్చాడు. 4 బంతులు ఎదుర్కొని 2 పరుగులు మాత్రమే చేసాడు. లేని పరుగు కోసం ప్రయత్నించి రనౌట్ గా వెనుదిరిగాడు. దీనితో మళ్లీ భారత్ కష్టాల్లో పడినట్లు కనిపించింది. అప్పటికి భారత్ స్కోరు 191. పైగా 5 వికెట్ల కోల్పోయింది.
 
ఈ దశలో వచ్చిన జడేజా బాధ్యతాయుతమైన ఆటను కోహ్లితో కలిసి ఆడాడు. వీళ్లిద్దరూ అవకాశం వచ్చినప్పుడల్లా భారీ షాట్లు కొడుతూ క్రమంగా జట్టు విజయానికి బాటలు వేసారు. చివర్లో సెంచరీ సాధిస్తాడనుకున్న కోహ్లికి ఆ అవకాశం చేజారిపోయింది. 47.4 ఓవర్ల వద్ద కోహ్లి భారీ షాట్ కొట్టగా ఫిలిప్స్ క్యాచ్ పట్టేసాడు. దాంతో క్రీజులోకి మహ్మద్ షమీ వచ్చాడు. ఆ దశలో జట్టు విజయానికి 5 పరుగులు కావాలి. షమీ ఒక పరుగు తీయడంతో క్రీజులోకి జడేజా వచ్చాడు. అంతే... ఫోర్ బాదటంతో టీమిండియా ఘన విజయం సాధించింది. పాయింట్ల పట్టికలో 10 పాయింట్లతో భారత్ అగ్రస్థానంలో వుంది.