శనివారం, 30 నవంబరు 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 29 నవంబరు 2024 (19:57 IST)

పాకిస్థాన్‌కు భారత జట్టు వెళ్ళదు : తేల్చి చెప్పిన కేంద్రం

team india
వచ్చే యేడాది పాకిస్థాన్ వేదికగా ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ జరుగనుంది. ఇందుకోసం ఐసీసీ కీలక సమావేశాన్ని నిర్వహించనున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఆసక్తికర ప్రకటన చేసింది. చాంపియన్స్ ట్రోఫీ పాకిస్థాన్‌లో నిర్వహిస్తే భారత జట్టు పాల్గొనదని భారత విదేశాంగ శాఖ స్పష్టం చేసింది. ఈ మేరకు విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ స్పందించారు. 
 
బీసీసీఐ చెప్పినట్టుగానే భారత క్రికెట్ జట్టు పాకిస్థాన్‌కు వెళ్ళదని స్పష్టం చేసింది. బీసీసీఐ నిర్ణయాన్ని తాము కూడా సమర్థిస్తున్నామని ఆయన పేర్కొన్నారు. పాకిస్థాన్‌లో భద్రతాపరమైన సమస్యలు ఎదురవుతాయని బీసీసీఐ ఆందోళన వ్యక్తం చేస్తున్న విషయం తెల్సిందే. అందుకే భారత క్రికెట్ జట్టు సభ్యులను చాంపియన్స్ ట్రోఫీ కోసం పాక్ గడ్డకు పంపించేది లేదని స్పష్టం చేశారు. 
 
కాగా, భారత్ తన నిర్ణయాన్ని తేటతెల్లం చేసిన నేపథ్యంలో హైబ్రిడ్ మోడల్‌లో చాంపియన్స్ ట్రోఫీ నిర్వహించాలన్న ప్రతిపాదనలు ఉన్నాయి. ఈ విధానం మేరకు కొన్ని మ్యాచ్‌లు పాకిస్థాన్‌లో మరికొన్ని మ్యాచ్‌లు ఇతర దేశాల్లో నిర్వహించేలా ఏర్పాట్లు చేస్తారు. అయితే, పాకిస్థాన్ మాత్రం హైబ్రిడ్ విధానానికి అంగీకరించే ప్రసక్తే లేదని స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో శుక్రవారం జరగాల్సిన ఐసీసీ కీలక సమావేం శనివారానికి వాయిదాపడింది.