శనివారం, 11 జనవరి 2025
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By
Last Updated : ఆదివారం, 6 జనవరి 2019 (14:17 IST)

సిడ్నీ టెస్ట్ : భారత్ విజయానికి వరుణుడు అడ్డు

సిడ్నీ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న టెస్టులో భారత్‌ను విజయం ఊరిస్తోంది. ఈ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా మూడు దశాబ్దాల తర్వాత ఫాలోఆన్‌ ఆడుతోంది. అయితే, ఈ టెస్టు నాల్గో రోజు ఆట ముగిసింది. వర్షం పదేపదే అంతరాయం కలిగించడం, వెలుతురులేమి కారణంగా ఆదివారం మ్యాచ్‌లో కేవలం 25 ఓవర్లు ఆట మాత్రమే సాగింది. 
 
మూడో సెషన్‌లో వెలుతురు తగ్గడంతో ఆసీస్ రెండో ఇన్నింగ్స్‌లో 6/0 స్కోరుతో టీ బ్రేక్‌కు వెళ్లింది. ఆ తర్వాత మళ్లీ వర్షం రావడంతో అంపైర్లు ఆటను తాత్కాలికంగా నిలిపివేశారు. ఇక ఆటను కొనసాగించేందుకు వాతావరణం అనుకూలించకపోవడంతో నాలుగో రోజును ఆటను ముగిస్తున్నట్లు ప్రకటించారు. 
 
తొలి ఇన్నింగ్స్‌లో ఇంకా 316 పరుగులు వెనుకంజలో ఉన్న ఆస్ట్రేలియా ఫాలోఆన్ ఆడుతోంది. ఉస్మాన్ ఖవాజా(4), మార్కస్ హారీస్(2) క్రీజులో ఉన్నారు. తొలి ఇన్నింగ్స్‌లో 300 పరుగులకు ఆలౌటైన ఆసీస్ రెండో ఇన్నింగ్స్ కొనసాగించింది. 
 
గత 1988లో ఆస్ట్రేలియా ఫాలోఆన్ ఆడాల్సి వచ్చింది. ఆపై ఆస్ట్రేలియా క్రికెట్ జట్టు, ఇంత ఘోరమైన పరిస్థితిలోకి రావడం ఇదే తొలిసారి. ఇక, నేటి మ్యాచ్ ఇంకా 35 ఓవర్ల పాటు సాగనుండగా, సాధ్యమైనన్ని ఎక్కువ వికెట్లు తీసి ఒత్తిడి పెంచాలన్నది భారత్ వ్యూహంగా ఉంది. ఆపై రేపటిలోగా ఆస్ట్రేలియాను ఆలౌట్ చేసి సిరీస్‌ను 3-1 తేడాతో గెలవాలన్నది కోహ్లీ సేన లక్ష్యం.
 
ఈ మ్యాచ్‌లో భారత్ ఓడిపోవడం దాదాపు అసాధ్యం. ఆసీస్ గెలవడమూ అంతే. ఎటొచ్చీ ఆస్ట్రేలియా ఆటగాళ్లు, క్రీజులో పాతుకుపోతే మ్యాచ్ డ్రాగా ముగిసే అవకాశాలు మాత్రం ఉన్నాయి. అప్పుడు కూడా ఇండియా 2-1 తేడాతో సిరీస్‌ను గెలుస్తుంది. ఆపై ఆస్ట్రేలియాలో టెస్ట్ సిరీస్‌ను గెలిపించిన తొలి భారత కెప్టెన్‌గా కోహ్లీ చరిత్ర సృష్టిస్తాడు.