టెస్టుల్లో మరో రికార్డు నెలకొల్పిన జస్ప్రీత్ బుమ్రా!
భారత స్టార్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా టెస్ట్ మ్యాచ్‌లలో సరికొత్త రికార్డును నెలకొల్పారు. ఈ యేడాది అత్యధిక వికెట్లు తీసిన తొలి బౌలర్‌గా నిలిచాడు. టెస్టుల్లో ఈ యేడాది ఇప్పటివరకు 50 వికెట్లు పడగొట్టాడు. ప్రస్తుతం భారత క్రికెట్ జట్టు ఆస్ట్రేలియాలో పర్యటిస్తుంది. ఈ పర్యటనలో భాగంగా శుక్రవారం నుంచి పింక్ బాల్ టెస్ట్ మొదలైంది. బోర్డర్ - గవాస్కర్ ట్రోఫీలో భాగంగా ఈ రెండో టెస్ట్ మ్యాచ్ పింక్ బాల్‌తో జరుగుతుంది. దీంతో ఈ టెస్ట్‌ను పింక్ బాల్ టెస్టుగా పిలుస్తున్నారు.
ఈ మ్యాచ్‌లో తొలుత టాస్ గెలిచిన భారత్... బ్యాటింగ్ ఎంచుకుని, తొలి ఇన్నింగ్స్‌లో 180 పరుగులకు ఆలౌట్ అయింది. ఆ తర్వాత ఆస్ట్రేలియా తన ఇన్నింగ్స్ చేపట్టింది. తొలి ఇన్నింగ్స్‌లో ఉస్మాన్ ఖవాజాను అవుట్ చేసి 50 వికెట్లు పూర్తి చేసుకున్నాడు. 11 టెస్టుల్లో బుమ్రా ఈ రికార్డు అందుకున్నాడు. ఈ క్రమంలో ఒక క్యాలెండర్ ఇయర్‌లో 50 లేదా అంతకంటే ఎక్కువ వికెట్లు సాధించిన మూడో భారత పేసర్‌గా రికార్డు సృష్టించాడు.
బుమ్రా కంటే ముందు మాజీ పేసర్లు కపిల్‌దేవ్, జహీర్ ఖాన్, ఈ ఘనత సాధించారు. 1979లో కపిల్‌దేవ్ 17 మ్యాచ్‌లలో 74 వికెట్లు పడగొట్టాడు. 1983లో కపిల్ 18 టెస్టుల్లో 75 వికెట్లు తీసి తన రికార్డు మెరుగుపర్చుకున్నాడు.
ఇక జహీర్ ఖాన్ 2002లో 15 మ్యాచ్‌ల్లో 51 వికెట్లు పడగొట్టాడు. అనిల్ కుంబ్లే, రవిచంద్రన్, అశ్విన్, హర్భజన్ సింగ్, బీఎస్ చంద్రశేఖర్, హిమ్మత్‌లాల్ మన్కడ్ కూడా ఒకే యేడాది 50 కంటే ఎక్కువ వికెట్లు సాధించారు. కానీ వీరంతా స్పిన్నర్లు. ఇదిలా ఆస్ట్రేలియా రెండో టెస్ట్ విషయానికొస్తే తొలి రోజు ఆట ముగిసేసరికి ఆసీస్ 86/1 స్కోరుతో బలమైన స్థితిలో నిలిచింది.