గురువారం, 9 జనవరి 2025
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 3 నవంబరు 2023 (13:49 IST)

ప్రపంచంలో అత్యదిక వికెట్లు తీసిన వీరుడుగా మహ్మద్ షమీ

shami
భారత పేస్ బౌలర్ మహ్మద్ షమీ అరుదైన రికార్డును సొంతం చేసుకున్నాడు. స్వదేశంలో జరుగుతున్న ఐసీసీ వన్డే ప్రపంచ కప్ టోర్నీలో ఈ రికార్డును లిఖించాడు. ప్రపంచ కప్ టోర్నీలో అత్యధిక వికెట్లు తీసిన భారత క్రికెటర్ల జాబితాలో మొదటి స్థానాన్ని దక్కించుకున్నాడు. 
 
ప్రస్తుతం జరుగుతున్న ప్రపంచ కప్‌లో ఆలస్యంగా తుదిజట్టులోకి వచ్చిన మహ్మద్‌ షమి ప్రపంచకప్‌లో అదరగొడుతున్నాడు. న్యూజిలాండ్‌పై ఐదు వికెట్లు, ఇంగ్లాండ్‌పై నాలుగు వికెట్లు పడగొట్టిన షమీ.. తాజాగా శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో మరోసారి ఐదు వికెట్లు తీసి లంకేయుల వెన్ను విరిశాడు. 
 
లంకపై ఐదు ఓవర్లు బౌలింగ్ చేసి 18 పరుగులే ఇచ్చి ఐదు వికెట్లు తీశాడు. దీంతో ప్రపంచకప్‌ చరిత్రలో అత్యధిక వికెట్లు పడగొట్టిన భారత బౌలర్‌గా రికార్డు సృష్టించాడు. అంతకుముందు ఈ రికార్డు జహీర్‌ఖాన్‌ (44), జవగళ్‌ శ్రీనాథ్‌ పేరిట ఉండేది. ప్రస్తుతం 45 వికెట్లతో అగ్రస్థానంలో ఉన్న షమి 14 మ్యాచ్‌ల్లోనే ఈ ఘనత అందుకున్నాడు.
 
అంతేకాదు వన్డేల్లో అత్యధికసార్లు (4) ఐదు వికెట్లు పడగొట్టిన భారత బౌలర్‌గానూ షమి రికార్డు సృష్టించాడు. జవగళ్ శ్రీనాథ్‌ (3), హర్భజన్ సింగ్ (3) తర్వాతి స్థానాల్లో ఉన్నారు. లంకపై అదిరిపోయే ప్రదర్శనతో ప్రస్తుత ప్రపంచకప్‌లో భారత తరపున అత్యధిక వికెట్లు పడగొట్టిన రెండో బౌలర్‌గా నిలిచాడు. బుమ్రా (15) వికెట్లతో తొలి స్థానంలో ఉండగా.. షమి (14) వికెట్లతో రెండో స్థానంలో నిలిచాడు. 
 
కాగా, ప్రపంచకప్‌లో అత్యధిక వికెట్లు పడగొట్టిన భారత బౌలర్లను పరిశీలిస్తే, మహ్మద్‌ షమి 45 వికెట్లు - (14 మ్యాచ్‌లు), జహీర్‌ఖాన్‌ 44 వికెట్లు - (23మ్యాచ్‌లు), జవగళ్‌ శ్రీనాథ్ 44 వికెట్లు - (34 మ్యాచ్‌లు), జస్‌ప్రీత్ బుమ్రా 33 వికెట్లు - (16 మ్యాచ్‌లు), అనిల్ కుంబ్లే 31 వికెట్లు - (18 మ్యాచ్‌లు), కపిల్‌దేవ్ 28 వికెట్లు - (26 మ్యాచ్‌లు)లు ఉన్నారు.