సోమవారం, 11 నవంబరు 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 22 సెప్టెంబరు 2021 (12:18 IST)

కివీస్ - ఇంగ్లండ్ జట్లపై ప్రతీకారం తీర్చుకోండి : పాక్ మాజీల పిలుపు

తమ దేశంలో క్రికెట్ సిరీస్‌లను అర్థాంతరంగా రద్దు చేసుకున్న న్యూజిలాండ్, ఇంగ్లండ్ జట్లపై ప్రతీకారం తీర్చుకోవాలని పాకిస్థాన్ మాజీ క్రికెటర్లు పిలుపునిస్తున్నారు. న్యూజిలాండ్‌ బాటలో ఇంగ్లండ్ కూడా తమ దేశ పర్యటన నుంచి తప్పుకోవడం పట్ల పాకిస్థాన్‌ క్రికెట్‌ బోర్డు కొత్త ఛైర్మన్‌ రమీజ్‌ రజా తీవ్ర స్థాయిలో మండిపడ్డాడు. 
 
ఇకపై ఈ జట్లను ముద్దు చేయడం మానుకుని, పాకిస్థాన్‌ స్వప్రయోజనాల కోసం కృషి చేయాలని కోరారు. రాబోయే టీ20 ప్రపంచకప్‌లో భారత్‌ను ఓడించడమే ఇప్పటిదాకా పాక్‌ ప్రధాన లక్ష్యమని, కానీ ఇప్పుడు తమ జట్టు కసిగా ఆడి న్యూజిలాండ్, ఇంగ్లాండ్‌లనూ ఓడించాలని రమీజ్‌ పిలుపునిచ్చాడు. 
 
'ఇంగ్లాండ్‌ కూడా పాక్‌ పర్యటనను రద్దు చేసుకోవడం నన్ను తీవ్ర నిరాశకు గురిచేసింది. కానీ ఇది ఊహించిందే. దురదృష్టవశాత్తూ ఇలాంటి పరిస్థితుల్లో పాశ్చాత్య దేశాలు ఒకదానికి ఒకటి మద్దతుగా నిలుస్తాయి. ముందుగా తమకు తలెత్తిన ముప్పు గురించి ఏ సమాచారం పంచుకోకుండానే న్యూజిలాండ్‌ వెళ్లిపోవడం మాకు ఆగ్రహం తెప్పించింది. ఇప్పుడు ఇంగ్లాండ్‌ తమ నిర్ణయాన్ని వెలువరించింది. ఈ జట్లు వచ్చినపుడు బాగా ముద్దు చేసే మాకు ఇదో గుణపాఠం. 
 
ఇప్పుడు ఆస్ట్రేలియా కూడా మా దేశ పర్యటనపై పునరాలోచిస్తోంది. వెస్టిండీస్‌ జట్టు పర్యటన మీదా ఈ పరిణామాలు ప్రభావం చూపొచ్చు. ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌.. ఇవన్నీ ఒకే సమూహంలో ఉంటాయి. మరి మేమెవరికి ఫిర్యాదు చేయాలి. తమకు మంచి చేయని న్యూజిలాండ్, ఇంగ్లాండ్‌లను ఓడించి వారిపై ప్రతీకారం తీర్చుకోవడానికి పాకిస్థాన్‌ జట్టు శారీరకంగా, మానసికంగా సిద్ధమవ్వాలి' అని రమీజ్ రాజా అన్నారు. అలాగే, మాజీ బౌలర్ షోయబ్ అక్తర్ కూడా ఇదే తరహా వ్యాఖ్యలు చేయడం గమనార్హం. కివీస్, ఇంగ్లండ్ జట్లను వదిలిపెట్టొద్దంటూ పిలుపునిచ్చారు.